గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా: సీఎం రేవంత్ రెడ్డి

గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో కలిసి గిగ్ వర్కర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల ర్యాలీ, బహిరంగ సభలో ప్రసంగించిన  సీఎం రేవంత్ రెడ్డి  గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు సాగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ పేదలు, కార్మికుల పక్షాన నిలబడుతుందని చెప్పారు. 

గిగ్ వర్కర్లు ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారికి చట్టబద్ధమైన ఆదాయం, తగిన భద్రత లభించడం లేదని సీఎం అన్నారు. రోజంతా పనిచేసినా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ సందర్భంగా గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కూడా అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ప్రత్యేక గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

గిగ్ వర్కర్ల శ్రమకు తగిన గుర్తింపు, భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకునే నిబద్ధత తమదని అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్స్ సంక్షేమ పథకం ప్రారంభించడం ప్రత్యేకమమన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఈ చట్టం అండగా నిలుస్తుందని సీఎం చెప్పారు.