హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. కొన్ని రోజుల కిందట తెలంగాణ గిగ్ వర్కర్లను కలిశానని, గిగ్ వర్కర్లను కలిసిన సమయంలో వారి బాధలను తెలుసుకున్నానని.. గిగ్ వర్కర్లకు అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేర్చానని రాహుల్ చెప్పారు. ఇన్నాళ్లూ గిగ్ వర్కర్లకు ఎంత డబ్బు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని, గిగ్ వర్కర్ల చట్టంతో వర్కింగ్ అవర్స్, ఎంత డబ్బులు వచ్చాయో మొత్తం డేటా తెలుస్తుందని వివరించారు.
గిగ్ వర్కర్లు రెస్ట్ తీసుకోవడానికి వైఫై ఉన్న ప్లేసులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిగ్ వర్కర్ల బాధలు, కష్టాలు చూశానని.. గిగ్ వర్కర్లకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని రాహుల్ భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ అన్ని కంపెనీల డేటా రికార్డులు ఉన్నాయని.. కానీ గిగ్ వర్కర్ల డేటా ఎక్కడా కనిపించదని.. ఇక నుంచి గిగ్ వర్కర్ల వివరాలు ఎక్కడైనా చూసుకోవచ్చని రాహుల్ చెప్పారు.
