Suryakumar Yadav: ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టిన భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2026)లో భాగంగా ఈరోజు (2026, నవంబర్ 14, శనివారం) కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో సూర్య భాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి పట్నం బౌలర్లకు చుక్కలు చూపించాడు.
21 బంతుల్లోనే 60 రన్స్.. 6 ఓవర్లు మిగిలుండగానే ముంబై విక్టరీ:
173 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య, క్రీజులోకి వచ్చిన వెంటనే గేర్ మార్చాడు. తాను ఎదుర్కొన్న మొదటి 4 బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు కొట్టి తన ఉద్దేశం ఎంటో క్లియర్ గా చెప్పేశాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న సూర్య భాయ్ 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 60 రన్స్ (స్ట్రైక్ రేట్ 285.71) బాదాడు. యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ (హాఫ్ సెంచరీ) తో కలిసి మూడో వికెట్‌కు కేవలం 23 బంతుల్లోనే 65 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. సూర్య ధాటికి ముంబై జట్టు ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది.
హైదరాబాద్ స్పిన్నర్లకు చుక్కలు చూపించిన సూర్య:
ఈ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ముఖ్యంగా హైదరాబాద్ స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. లెగ్ స్పిన్నర్ వేద్ రెడ్డి అమిస్తాపురం బౌలింగ్‌లో 22 రన్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రణవ్ వర్మ బౌలింగ్‌లో 24 పరుగులతో బౌండరీల వర్షం కురిపించాడు.
5 నెలల తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ:
36 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ చివరిసారిగా మే నెలలో జరిగిన IPL 2026లో ముంబై ఇండియన్స్ తరఫున అధికారిక టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జూన్‌లో ముంబై టీ20 లీగ్‌లో కనిపించినా, మళ్లీ ఇప్పటి వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు.. ఈ నెల ఆరంభంలోనే ముంబై జట్టు కెప్టెన్‌గా నియమితులైన సూర్య భాయ్, రీఎంట్రీ మ్యాచ్‌లోనే ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
