పెళ్లిళ్ల కోసం లక్షలు అప్పు చేస్తున్న మధ్య తరగతి కుటుంబాలు: EMIలు కట్టుకోలేక నానా ఇబ్బందులు

పెళ్లిళ్ల కోసం లక్షలు అప్పు చేస్తున్న మధ్య తరగతి కుటుంబాలు: EMIలు కట్టుకోలేక నానా ఇబ్బందులు

భారతీయ సమాజంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు.. కుటుంబాలన్నీ ఏకమై జరుపుకునే గొప్ప వేడుక. బంధుమిత్రుల సందడి, ఆర్భాటాలు, విందులు, విలాసాలతో పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఆనందాల వెనుక చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో తమ హోదాను కాపాడుకోవాలనే తపన, బంధువుల అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి కారణంగా ఎన్నో ఫ్యామిలీస్ తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నారు పెళ్లిళ్లకి. ఒకే ఒక్క జీవితకాల వేడుక అనే భావనతో అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ పెళ్లి తంతు ముగిసి అతిథులు వెళ్లిపోయిన తర్వాత అసలైన ఆర్థిక కష్టాలు తెరపైకి వస్తాయి.

భారతదేశంలో వెడ్డింగ్ బిజినెస్ విలువ దాదాపు రూ.6లక్షల 50వేల కోట్లకు పైనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల వివాహాలు జరుగుతుంటాయి. 2వేల మందికి పైగా ప్రజలపై జరిపిన సర్వే ఆధారంగా వెలువడిన ఇటీవలి నివేదిక ప్రకారం.. వివాహ ఖర్చులు ఏటా 8 శాతం చొప్పున పెరుగుతున్నాయని తేలింది. ప్రస్తుతం సగటు మ్యారేజ్ బడ్జెట్ రూ.39లక్షల 50వేలకు చేరుకోగా.. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఖర్చు సగటున రూ.58 లక్షలుగా ఉందని తెలిసింది.

రిపోర్ట్ ప్రకారం దాదాపు 78 శాతం జంటలు తమ స్వంత సేవింగ్స్ డబ్బుతోనే పెళ్లి చేసుకుంటున్నప్పటికీ.. 15.1 శాతం మంది మాత్రం ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా లోన్స్ తీసుకున్న వారు సగటున రూ.15.5 లక్షల వరకు అప్పు చేస్తున్నారు. ఎక్కువగా ఖర్చు ఖరీదైన వెడ్డింగ్ వెన్యూలు, బంగారు ఆభరణాలు, క్యాటరింగ్ కోసమే అవుతోందట.

మిడిల్‌క్లాస్ ఫ్యామిలీస్‌కి రూ.15 లక్షలు అప్పు చేయడం అనేది చాలా పెద్ద ఆర్థిక భారం. సాధారణంగా వచ్చే ఆదాయంతో మొదట్లో ఈఎంఐలు చెల్లించడం సులభంగా అనిపించినా.. ఉద్యోగం పోవడం, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ఆదాయం తగ్గడం వంటి అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు ఆ అప్పులు తీర్చడం భారంగా మారుతుంది.

ఇక చిన్నచిన్న పెళ్లి ఖర్చులు, షాపింగ్ కోసం చాలా మంది క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్ సేవలు, మొబైల్ యాప్‌ల ద్వారా క్విక్ లోన్స్ పై ఆధారపడుతున్నారు. దీనివల్ల దేశంలో హౌస్‌హోల్డ్ డెట్ జీడీపీలో 47.8 శాతానికి చేరుకున్నాయి. క్రెడిట్ కార్డ్ బకాయిలు కేవలం ఐదేళ్లలో 3 రెట్లు పెరిగి రూ.2 లక్షల 70వేల కోట్లకు చేరగా పర్సనల్ లోన్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. 

అప్పుల ఊబి అనుభవం..
అప్పులు మనిషిని మానసికంగా ఎలా కుంగదీస్తాయో చెప్పడానికి ముంబైకి చెందిన 38 ఏళ్ల వ్యక్తి జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. వ్యాపారంలో నష్టాల తర్వాత కుటుంబ ఖర్చుల కోసం, బంధువుల పెళ్లి ఖర్చుల కోసం ఆయన క్రెడిట్ కార్డును వాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ బకాయిలు తీర్చడానికి పర్సనల్ లోన్ తీసుకున్నారు. క్రమంగా ఈ అప్పుల చక్రంలో చిక్కుకున్న ఆయన వద్ద ఏకంగా 13 వేర్వేరు లోన్ అకౌంట్లు అయ్యాయి. మొత్తం బకాయిలు రూ.6లక్షల 23వేలకి చేరిందట.

దీంతో ఆయనకు రోజుకు 200లకు పైగా రికవరీ కాల్స్ రావడం, ఏజెంట్లు ఇంటికి వచ్చి వేధించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. చివరకు ఒక డెట్ నెగోషియేషన్ సంస్థ జోక్యంతో లెండర్లతో చర్చలు జరిపి.. ఆ అప్పును రూ.2లక్షల 22వేలకి సెటిల్ చేసుకున్నాడట. అప్పులు మనిషి జీవితంలో ప్రశాంతతను ఎలా నాశనం చేస్తాయో ఇది కళ్లకు కడుతోంది. పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టమే అయినప్పటికీ.. కేవలం నలుగురి మెప్పు కోసం.. హోదా కోసం ఆడంభరాలకు పోయి లక్షల్లో అప్పులు చేయడం భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఆర్భాటాల కంటే ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యతనిస్తూ.. తమ స్థోమతకు తగ్గట్టుగా వేడుకలు జరుపుకోవడం ఎంతో ముఖ్యం.