గిగ్ వర్కర్లకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్లకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా గిగ్ వర్కర్ల సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం ( నవంబర్ 14 ) జరిగిన ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్చ్చ్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గిగ్ వర్కర్లు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గిగ్ వర్కర్లకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగానే గిగ్ వర్కర్ల చట్టం అమలు చేశామని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, గాంధీ ఫ్యామిలీ కట్టుబడి ఉందని అన్నారు మంత్రి వివేక్ .ఈ చట్టం ద్వారా రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, బీమా, ఇతర సంక్షేమ పథకాలు అందించడానికి ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మంత్రి వివేక్.

కంపెనీలు అకారణంగా గిగ్ వర్కర్ల ఐడీలను బ్లాక్ చేస్తున్న సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని... కొత్త చట్టం, ప్రభుత్వ జోక్యం వల్ల ఇప్పటికే ఒక కంపెనీకి సంబంధించిన 16వేల మంది వర్కర్ల ఐడీలను తిరిగి యాక్టివేట్ చేయించామని అన్నారు మంత్రి వివేక్.

స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు పని ఒత్తిడి తగ్గించడం, సరైన వేతనాలు, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.