మీకు తెలుసా : దేశంలో ఫస్ట్ STD కాల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు..?

మీకు తెలుసా : దేశంలో ఫస్ట్ STD కాల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడి నుంచి  ఎక్కడికి చేశారు..?

ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడటం చాలా ఈజీ. దేశంలో ఎక్కడున్న వారికైనా, విదేశాల్లో ఉన్న వారికైనా క్షణాల్లో కాల్ చేయొచ్చు. సుమారు 66 ఏళ్ల క్రితం మాత్రం పరిస్థితి ఇలా ఉండేది కాదు. మరో చోట లేదా ప్రదేశంలో ఉన్నవారికి ఫోన్ చేయాలన్నా చాలా కష్టంగా ఉండేది.

అప్పట్లో ఒక నగరం నుంచి మరో నగరానికి ఫోన్ చేయాలంటే టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ సహాయం తీసుకోవాల్సి వచ్చేది. ఆపరేటర్‌కు కాల్ వివరాలు చెప్పి, కనెక్షన్ కోసం కొంతసేపు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ఈ పరిస్థితిని మార్చుతూ 1960లో భారతదేశంలో తొలి STD సేవ ప్రారంభమైంది.

1960 నవంబర్ 26న తొలి STD కాల్
1960 నవంబర్ 26 భారత టెలికాం చరిత్రలో ఎంతో ముఖ్యమైన రోజు. ఆరోజే దేశంలో మొదటిసారిగా సబ్‌స్క్రైబర్ ట్రంక్ డయలింగ్ (STD) సేవ ప్రారంభమైంది. 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నో నగరాల మధ్య ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవ ప్రారంభమైన తర్వాత ప్రజలు మరో నగరంలో ఉన్నవారికి నేరుగా ఫోన్ చేయగలిగారు. ఇందుకోసం టెలిఫోన్ ఆపరేటర్‌కు కాల్ బుక్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కనెక్షన్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా తగ్గింది.

STD రాకముందు పరిస్థితి ఎలా ఉండేది?

1923లోనే లాహోర్, లయల్‌పూర్ మధ్య చాల దూర ఫోన్ కాల్స్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే అప్పట్లో ఫోన్ కాల్స్‌ను డైరెక్ట్  ప్రజలు  చేసుకునే అవకాశం ఉండేది కాదు. టెలిఫోన్ ఆపరేటర్ సహాయంతోనే కాల్స్ కనెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. అందుకే 1960లో కాన్పూర్, లక్నో మధ్య ప్రారంభమైన STD సేవను దేశంలో తొలి పూర్తిస్థాయి ఆటోమేటిక్ డయలింగ్ సేవగా గుర్తిస్తారు.

1987 నాటికి దేశవ్యాప్తంగా విస్తరణ

కాన్పూర్, లక్నో మధ్య ప్రారంభమైన STD సేవ క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. 1987 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు STD నెట్‌వర్క్ ద్వారా ఢిల్లీతో అనుసంధానమయ్యాయి. దీంతో ఒక నగరం నుంచి మరో నగరానికి ఫోన్ చేయడం మరింత సులభమైంది.

ALSO READ : టెక్నాలజీ వాడకం అంటే ఇలా ఉండాలి..

ఒకప్పుడు ఫోన్ కాల్ చేయాలంటే ఆపరేటర్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది STD సేవ అందుబాటులోకి రావడంతో ప్రజలు నేరుగా నంబర్ డయల్ చేసి మాట్లాడగలిగారు. ఇప్పటి  మొబైల్ ఫోన్ సౌకర్యాలకు ముందు భారత టెలికాం రంగంలో ఇదొక కీలకమైన మార్పుగా నిలిచింది.