ముడి సరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లపై పడుతున్న భారాన్ని తట్టుకునేందుకు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సంస్థ 2027 ఆర్థిక సంవత్సరం నాలుగో తైమాసికంలో కార్ల రేట్లను మరింత పెంచే ప్లాన్ లో ఉంది. ఉక్కు, రబ్బరు, రాగి వంటి ముడిసరుకుల ధరల పెరుగుదల కంపెనీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో గతంలో కంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో ధరల పెంపు ఉండొచ్చని కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు.
తొలి అర్ధభాగంలో ఎదురైన భారాన్ని, కంపెనీకి వచ్చిన భారీ నష్టాలను తగ్గించుకోవడానికి చర్యలు చేపట్టినప్పటికీ, దాదాపు 60 శాతం భారాన్ని ఆటోమొబైల్ సంస్థే భరిస్తోంది. ఫలితంగా దేశీయ ప్యాసింజర్ వాహన వ్యాపారంలో ఈబిటా మార్జిన్ 4 శాతానికి పడిపోయింది. అయితే మూడో తైమాసికంలోనూ ఈ ఒత్తిడి కొనసాగినా.. నాలుగో తైమాసికంలో ఖర్చుల తగ్గింపు చర్యలు, ధరల పెంపు ద్వారా లాభదాయకత మెరుగుపడుతుందని కంపెనీ భావిస్తోంది.
ముడిసరుకుల ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉన్నందున.. ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా సంస్థ జాగ్రత్త పడుతోంది. ఏయే ధరలు శాశ్వతంగా పెరుగుతాయో అంచనా వేసిన తర్వాతే రేట్ల పెంపుపై ఫైనల్ డెసిషన్ ఉంటుందంట. ప్రస్తుతానికి డిమాండ్ మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. Q2 FY27లో కంపెనీ అత్యధికంగా 2 లక్షలకు పైగా వాహనాల అమ్మకాలు జరిపి.. 14.3 శాతం దేశీయ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
ALSO READ : కార్ల తయారి ఖర్చు పెరిగింది.. కొత్తగా ఇన్వెస్ట్ చేయలేం..
ప్రస్తుతం డీలర్ల వద్ద నిల్వలు 30 రోజులకు మించకుండా ఉండటంతో.. సమీప భవిష్యత్తులో భారీ డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం లేదని శైలేష్ చంద్ర స్పష్టం చేశారు. పండుగ సీజన్ ఆఫర్లు కూడా స్టాక్ ఉన్న కొన్ని మోడళ్లకే పరిమితమయ్యాయి. FY26తో పోలిస్తే డిస్కౌంట్ల వాతావరణం ప్రస్తుతం పూర్తిగా మారిందని, బలమైన డిమాండ్ కారణంగా దూకుడుగా ప్రమోషనల్ స్కీమ్స్ ప్రకటించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
