UPI ఛార్జీలపై సందేహాలు.. రీఫండ్స్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ల భారం కస్టమర్లదా? వ్యాపారులదా?

UPI ఛార్జీలపై సందేహాలు.. రీఫండ్స్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ల భారం కస్టమర్లదా? వ్యాపారులదా?

ఇండియాలో జనం ఎక్కువగా వాడుతున్న UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) అమలుకు రంగం సిద్ధమవుతోంది. రూ.2వేల కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు వసూలు చేయాలని NPCI నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూ.75వేలు అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఈ రుసుము గరిష్టంగా రూ.300గా నిర్ణయించారు. అయితే ఈ నూతన విధానం వల్ల లావాదేవీల రద్దు, రీఫండ్లు, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ల విషయంలో ప్రజలతో పాటు వ్యాపారులకు అనేక అనుమానాలు ఉన్నాయి. 

పూర్తి రీఫండ్ లభిస్తుందా?
ఒకవేళ కస్టమర్ రూ.50వేలు విలువైన లాప్‌టాప్, టీవీ లాంటి ఖరీదైన వస్తువులను యూపీఐ ద్వారా కొనుగోలు చేసి, ఆ తర్వాత ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకుంటే కస్టమర్‌కు పూర్తి డబ్బు వెనక్కి రీఫండ్ వస్తుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. కస్టమర్ చెల్లించిన మొత్తం పూర్తిస్థాయిలో వెనక్కి లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎండీఆర్ అనేది వ్యాపారి భరించాల్సిన ప్రాసెసింగ్ ఫీజు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్లకు బదిలీ చేయడానికి వీలులేదు. కస్టమర్ ఎండీఆర్ చెల్లించనందున, రీఫండ్ సమయంలో వ్యాపారులు ఆ మొత్తాన్ని తగ్గించుకుంటాం అంటే రూల్స్ ఒప్పుకోవని నిపుణులు అంటున్నారు. 

వ్యాపారులకు ఎండీఆర్ వెనక్కి వస్తుందా?
కస్టమర్‌కు పూర్తి రీఫండ్ ఇచ్చినప్పుడు, వ్యాపారి చెల్లించిన ఎండీఆర్ ఛార్జీలు తిరిగి వస్తుందా అనే దానిపై మోడీ సర్కార్ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సక్సెస్‌ఫుల్ లావాదేవీకి సంబంధించి ఇప్పటికే ఈకోసిస్టమ్‌లో వసూలు చేసిన ఫీజు పంపిణీ జరిగిపోతుంది. క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీల మాదిరిగానే యూపీఐ విషయంలోనూ రీఫండ్ ఇస్తే ఎండీఆర్ వెనక్కి రాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే పాక్షిక రీఫండ్లు, రూ.లక్ష వంటి భారీ లావాదేవీల విషయంలో వసూలు చేసిన ఛార్జీలను ఎలా సర్దుబాటు చేయాలనేదానిపై తగిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

ఫెయిల్ అయిన లావాదేవీల పరిస్థితి?
యూపీఐ చెల్లింపు సమయంలో అకౌంట్ నుంచి డబ్బు డెబిట్ అయి.. మర్చంట్‌కు కన్ఫర్మేషన్ రాకపోతే పరిస్థితి ఏమిటనేది మరో పెద్ద ప్రశ్న కూడా ఉంది. ఒక లావాదేవీ ఫెయిలై వ్యాపారికి ఎలాంటి సొమ్ము అందకపోతే దానిపై ఎండీఆర్ వసూలు చేయడానికి వీలుండదు. అయితే ఆ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా రివర్స్ చేయడానికి ఆర్బీఐ టర్న్‌అరౌండ్ టైమ్ (T+5 రోజులు) నిబంధనలు వర్తిస్తాయి. నిర్దిష్ట గడువులోగా రివర్సల్ కాకపోతే కస్టమర్‌కు రోజువారీగా పరిహారం కూడా లభిస్తుంది.

ALSO READ : ఖర్చులు పెరిగాయ్, లాభాలు తగ్గాయ్.. 

చిన్న లావాదేవీలుగా విభజించే ప్రమాదం
రూ.2వేల లోపు లావాదేవీలకు ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉండటంతో.. కొందరు వ్యాపారులు పెద్ద మొత్తాలను చిన్న చిన్న పేమెంట్‌లుగా విడగొట్టే ప్రమాదముంది. ఇది రిటర్నులు, వివాదాల పరిష్కార సమయంలో అదనపు రికన్సిలేషన్ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఎండీఆర్ విధింపునకు ముందు ఈ సాంకేతిక అంశాలపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు వ్యాపారులు వ్యక్తం చేస్తున్న సమస్యలపై ఎలాంటి రూల్స్ వస్తాయి, దీపావళి తర్వాత ఎప్పటి నుంచి యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీల బాదుడు స్టార్ట్ అవుతుందనే విషయాలపై క్లారిటీ కోసం ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.