ప్రజాస్వామ్యం – నియంతృత్వం మధ్య ప్రపంచ పోరాటం.. ప్రజాస్వామ్య పరిరక్షణే మా లక్ష్యం: సీఎం రేవంత్

ప్రజాస్వామ్యం – నియంతృత్వం మధ్య ప్రపంచ పోరాటం.. ప్రజాస్వామ్య పరిరక్షణే మా లక్ష్యం: సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం కొనసాగుతోందని, ఒకవైపు ప్రజాస్వామ్యం, మరోవైపు నియంతృత్వం ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. అయితే కొన్ని శక్తులు రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచి, అధికారాన్ని ఒకే వ్యక్తి లేదా పార్టీ చేతుల్లో కేంద్రీకరించాలని చూస్తున్నాయని విమర్శించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన తమ ప్రధాన లక్ష్యాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతుల హక్కులను కాపాడటమే తమ ధ్యేయమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష శక్తులు బడా పారిశ్రామికవేత్తలు, బిలియనీర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.

ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని తాము విశ్వసిస్తామని, కానీ ప్రత్యర్థులు ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ఆదేశాల మేరకు వ్యవస్థ నడవాలని భావిస్తున్నారని విమర్శించారు.

ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటే

గ్లోబలైజేషన్, కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఒకే తరహా సమస్యలను ఎదుర్కొంటున్నాయని సీఎం అన్నారు. ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్యం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.

►ALSO READ | వాళ్లు ఓడిపోయే రోజు వస్తుంది.. సత్యం, అహింస చేతిలోనే వాళ్ల ఓటమి : రాహుల్ గాంధీ

కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, వారి కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులపై ఉందన్నారు. ప్రజల హక్కులు, సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో మార్పు

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పౌరులందరి ఓటు హక్కు పరిరక్షణతో పాటు దళితులు, మైనారిటీలు, ఓబీసీలకు సామాజిక న్యాయం కల్పించడం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశంలో మార్పు తీసుకొస్తామని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వాలు ధనవంతుల ప్రయోజనాల కోసం కాకుండా సామాన్య ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు.

తమను అడ్డుకోగలమని ప్రత్యర్థులు భావించడం భ్రమ మాత్రమేనని, సత్యం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న తమను ఏ శక్తీ ఆపలేదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.