వాళ్లు ఓడిపోయే రోజు వస్తుంది.. సత్యం, అహింస చేతిలోనే వాళ్ల ఓటమి : రాహుల్ గాంధీ

వాళ్లు ఓడిపోయే రోజు వస్తుంది.. సత్యం, అహింస చేతిలోనే వాళ్ల ఓటమి : రాహుల్  గాంధీ

ద్వేషం, హింసతో ప్రత్యర్థులను ఎదుర్కోలేమని, ప్రేమ, సత్యం, అహింసతోనే పోరాటం కొనసాగిస్తామని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలు ద్వేషం, హింసకు వ్యతిరేకమని అన్నారు. చివరకు సత్యం, అహింస, ప్రేమ చేతిలోనే ద్వేషపూరిత శక్తులు ఓడిపోతాయని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ద్వేషం, హింసతో వాళ్లను ఎదుర్కోలేం. అవి మన సిద్ధాంతాలు కావు. కోపం, ద్వేషం లేకుండా ప్రేమతోనే వాళ్లను ఎదుర్కొంటాం. వాళ్లు ఓడిపోయే రోజు వస్తుంది. సత్యం, అహింస, ప్రేమ చేతిలోనే వాళ్లు ఓడిపోతారు" అని అన్నారు.తమతో కలిసి ఒకే తరహా ఆలోచనలతో, ఒకే విధమైన పోరాటం చేస్తున్న మిత్రులందరికీ రాహుల్ గాంధీ స్వాగతం పలికారు. ఒకే తరహా ఆర్థిక వ్యవస్థ, ద్వేషపూరిత శక్తులకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

దేశంలోని ప్రతి మూల నుంచి ఫాసిస్టు శక్తులను తరిమికొట్టడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఈ పోరాటంలో ఎవరినీ ద్వేషించడం, కించపరచడం లేదా అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ALSO READ : ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. దేశంలో 10 ఏళ్లుగా భయానక వాతావరణం