NCP విలీనం నిజం కాదు.. శరద్ పవార్, సుప్రియా సూలే బీజేపీలో చేరరు: సంజయ్ రౌత్

NCP విలీనం నిజం కాదు.. శరద్ పవార్, సుప్రియా సూలే బీజేపీలో చేరరు: సంజయ్ రౌత్

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలీన వార్తలను శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. ఈ ఊహాగానాలను కల్పిత కథ అని ఆయన అభివర్ణించారు. శరద్ పవార్, సుప్రియా సూలే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్సీపీ విలీన ప్రచారం ఒకటి రెండు రోజుల్లో సద్దుమణుగుతుందని పేర్కొన్నారు.

సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ల మధ్య ఎన్‌సీపీ విలీనం గురించి ఎలాంటి సమావేశం జరగలేదని తెలిపారు. ఎన్సీపీ రెండు వర్గాలకు వేర్వేరు రాజకీయ ప్రయోజనాలు, సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. ఎన్సీపీ విలీనం గురించి బీజేపీ కావాలనే గందరగోళం సృష్టిస్తోందన్నారు. ప్రఫుల్ పటేల్‌కు అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. 

రాజకీయ నాయకులతో పాటు సైనికాధికారుల ఫోన్లు కూడా ట్యాప్:

తన ఫోన్‎ను కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఈ దేశంలో ఎవరి ఫోన్లు ట్యాప్ చేయబడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, సునేత్రా పవార్ సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, సైనికాధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో అసంతృప్తి పెరుగుతోందన్నారు. 

►ALSO READ | ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. దేశంలో 10 ఏళ్లుగా భయానక వాతావరణం: రాహుల్ గాంధీ

వచ్చే ఏప్రిల్-మేలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు

వచ్చే ఏప్రిల్-మే నాటికి దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు మోడీ ప్రధాన మంత్రిగా ఉండరని.. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా తాను ఈ అంచనాకు వచ్చినట్లు స్పష్టం చేశారు.