వంట బంద్.. బయటి తిండే ట్రెండ్..రెడీ టు ఈట్ ఖర్చుల్లో దేశంలో తెలంగాణ టాప్

వంట బంద్.. బయటి తిండే ట్రెండ్..రెడీ టు ఈట్ ఖర్చుల్లో దేశంలో తెలంగాణ టాప్
  • ఫుడ్ బడ్జెట్‌‌‌‌లో 16.3 శాతం సర్వ్డ్, రెడీమేడ్ తిండికే
  • తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మేఘాలయ, కర్నాటక
  • మొత్తం ఆహార ఖర్చులోనూ మన రాష్ట్రానికి ఐదో స్థానం
  • ఎస్‌‌‌‌బీఐ రీసెర్చ్ విభాగం సర్వేలో కీలక అంశాలు వెల్లడి


 

హైదరాబాద్, వెలుగు: ఉరుకుల పరుగుల జీవితం.. బిజీ వర్క్ షెడ్యూళ్లు.. వంటింట్లో నిలబడి గరిటె తిప్పే తీరిక లేకపోవడం.. వెరసి తెలంగాణ ప్రజల ఆహారపు అలవాట్లలో భారీ మార్పులొస్తున్నాయి. ఇంట్లో వండే తిండి కంటే బయటి నుంచి తెచ్చుకునే ఆహారం, రెడీ టు ఈట్ (ప్యాకేజ్డ్) ఫుడ్ వైపే రాష్ట్ర ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

కుటుంబ ఆహార బడ్జెట్‌‌‌‌లో బయటి తిండి, రెడీమేడ్ మీల్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఈ జాబితాలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘హౌస్‌‌‌‌హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్‌‌‌‌పెండిచర్ సర్వే 2023–24’ గణాంకాలను విశ్లేషించి ఎస్‌‌‌‌బీఐ రీసెర్చ్ విభాగం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎస్‌‌‌‌బీఐ అధ్యయనం ప్రకారం.. తెలంగాణలోని కుటుంబాలు తమ మొత్తం ఆహార ఖర్చులో ఏకంగా 16.3 శాతాన్ని రెడీ టు ఈట్, హోటళ్లు లేదా రెస్టారెంట్లలో సర్వ్ చేసే ఆహారం కోసమే ఖర్చు చేస్తున్నాయి. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ కేటగిరీ ఆహారానికి ఇంత భారీగా ఖర్చు చేయడం లేదు. తెలంగాణ తర్వాత తమిళనాడు, మేఘాలయ, కర్నాటక రాష్ట్రాలు కూడా రెడీమేడ్ ఆహారానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. 
 
 వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, మారిన లైఫ్‌‌‌‌స్టైల్ కారణంగానే వంటింట్లో వంట తగ్గి బయటి తిండిపై ఆధారపడటం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ఆహారంపై పెట్టే ఖర్చు కూడా గణనీయంగా పెరిగిందని ఎస్‌‌‌‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది. నెలవారీ సగటు ఆహార వినియోగ ఖర్చులో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. హర్యానా, నాగాలాండ్, గోవా, కేరళ రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే ముందున్నాయి.

మగోళ్లున్న ఇండ్లలోనే ఖర్చు ఎక్కువ

దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఆహార వినియోగ ప్రాధాన్యతలు భిన్నంగా ఉన్నట్లు ఎస్‌‌‌‌బీఐ నివేదిక వెల్లడించింది. గోవాలో ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్‌‌‌‌పై 11.4 శాతం ఖర్చు చేస్తున్నట్టు పేర్కొంది. హర్యానా ప్రజలు పాలు, పాల ఉత్పత్తులపై బడ్జెట్‌‌‌‌లో 28.6 శాతం ఖర్చు పెడుతున్నారు. జార్ఖండ్‌‌‌‌లో బియ్యం, గోధుమలు వంటి వాటికి అత్యధికంగా 38.6 శాతం బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో పప్పుధాన్యాలపై 20.5 శాతం, కూరగాయలపై 14.3 శాతం ఖర్చు చేస్తున్నారు. కేరళలో పండ్ల కోసం 7 శాతం కేటాయిస్తున్నారు. అయితే గుడ్లు, చేపలు, మాంసం, డ్రై ఫ్రూట్స్, పండ్ల కొనుగోళ్లు మాత్రం దేశవ్యాప్తంగా తగ్గిపోతున్నట్టు రిపోర్టు పేర్కొంది. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులకు సంబంధించిన ఆహార ఖర్చు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ జాబితాలో తెలంగాణ, ఒడిశా, పంజాబ్, ఛత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్రాలు ముందున్నట్టు వెల్లడైంది. 

ఆన్‌‌‌‌లైన్ కొనుగోళ్లు తక్కువే..

డిజిటలైజేషన్ ఊపందుకుంటున్నప్పటికీ ఆహార పదార్థాల కొనుగోళ్లలో ఆన్‌‌‌‌లైన్ ఆర్డర్లు ఇంకా నామమాత్రంగానే ఉన్నాయని నివేదిక తెలిపింది. నిత్యావసర సరుకులను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్ చేసేవారి వాటా 4.29 శాతంగా ఉన్నట్టు తెలిపింది. హోటల్ ఫుడ్ (సర్వ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్) ఆన్‌‌‌‌లైన్ కొనుగోళ్లు 2.62 శాతం కాగా, ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్డర్లు 1.65 శాతంగా నమోదయ్యాయి. తాజా కూరగాయలు (1.32%), పండ్లు (1%), డ్రై ఫ్రూట్స్ (0.62%) కొనుగోళ్లలో ఆన్‌‌‌‌లైన్ వాటా చాలా తక్కువగా ఉంది. తాజా ఆహార పదార్థాల కోసం ప్రజలు ఇప్పటికీ నేరుగా మార్కెట్లకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో ఉండే సభ్యుల వయసును బట్టి కూడా ఆహార ఖర్చు మారుతోందని అధ్యయనం పేర్కొంది. వృద్ధులు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో పాలు, పండ్లు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండగా, పిల్లలు ఉన్న ఇండ్లలో పాల ఉత్పత్తులతో పాటు రెడీ టు ఈట్, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల కోసం ఎక్కువ బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు ఎస్‌‌‌‌బీఐ నివేదిక స్పష్టం చేసింది.