హైదరాబాద్, వెలుగు: గోల్డ్లోన్లు ఇచ్చే ఎన్బీఎఫ్సీ ఇండెల్ మనీ లిమిటెడ్ నికర లాభం 2026 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏడాది లెక్కన 222 శాతం పెరిగి రూ.79.98 కోట్లకు చేరింది. నిర్వహణలో ఉన్న రుణ ఆస్తుల విలువ (ఏయూఎం) 83 శాతం వృద్ధితో రూ.5,015 కోట్లకు పెరిగింది. కంపెనీ నికర ఆదాయం 111 శాతం పెరిగి రూ.159.81 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 118 శాతం వృద్ధితో రూ.145 కోట్లుగా నమోదైంది.
ప్రధాన వ్యాపారం ద్వారా వచ్చే నిర్వహణ లాభం 182 శాతం పెరిగి రూ.98.95 కోట్లకు చేరింది. స్థూల ఎన్పీఏయేలు 1.41 శాతంగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో కంపెనీ రూ.107.62 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వార్షికంగా ఇది 121 శాతం అధికం.
