హైదరాబాద్, వెలుగు: ఐడీబీఐ బ్యాంక్‌ను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల సమగ్ర ఆర్థిక సేవల సంస్థగా తీర్చిదిద్దాలని కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ భావిస్తోంది. బ్యాంకులో 60.72 శాతం నియంత్రణ వాటాను రూ.52,878 కోట్లకు కొనుగోలు చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది.
ఒక్కో షేరుకు రూ.81 చొప్పున ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన స్వతంత్ర విలువ అంచనా ఒక్కో షేరుకు రూ.75.99గా ఉండగా, దానికంటే అధిక ధరను ఫెయిర్‌ఫాక్స్ ప్రతిపాదించింది. 2026 మార్చి నాటి బ్యాంకు నియంత్రణ పుస్తక విలువ రూ.51.85 తో పోలిస్తే ఈ ఆఫర్ 56 శాతం అధికం. ఐడీబీఐ బ్యాంకు ద్వారా బ్యాంకింగ్‌తో పాటు బీమా, పెట్టుబడి బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను విస్తరించాలని యోచిస్తోంది.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాలను కూడా ఈ వేదికతో అనుసంధానిస్తారు. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్‌లో ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ వాటాను కూడా ఇందులోకి తీసుకురావాలని భావిస్తోంది.
