రాహుల్ నాయకత్వంలోనే దేశంలో మార్పు: సీఎం రేవంత్

రాహుల్ నాయకత్వంలోనే దేశంలో మార్పు: సీఎం రేవంత్
  • మేం రాజ్యాంగం వైపు.. వాళ్లు బిలియనీర్ల వైపు
  • కొందరికే ఓటు హక్కు ఉండాలన్నది బీజేపీ ఆలోచన
  • ఓటు హక్కు, సామాజిక న్యాయం కోసం రాహుల్ పోరాటం
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రపంచ శక్తులు ఏకం కావాలె
  • వీసాలు రద్దు చేసినా మమ్మల్ని ఎవరూ ఆపలేరు
  • భారత్ సమిట్ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశంలో మార్పు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ప్రతి పౌరుడి ఓటు హక్కు కోసం, దళితులు, మైనారిటీలు, ఓబీసీల సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి నడుమ పోరాటం జరుగుతోందన్నారు. తాము రాజ్యాంగం, చట్టబద్ధ పాలన కోసం నిలబడితే.. వాళ్లు బడా బాబులు, బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయాన్ని కాపాడుకునేందుకు వివిధ దేశాల ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. శనివారం హెచ్‌‌‌‌‌‌‌‌ఐసీసీలో జరిగిన రెండో అంతర్జాతీయ ‘భారత్ సమిట్’ ముగింపు సమావేశంలో లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ తో కలిసి సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, విపక్షాల విమర్శలకు సమాధానం ప్రధాన అంశాలుగా ఆయన స్పీచ్ సాగింది.

వీసాలు రద్దు చేసినా మమ్మల్ని ఆపలేరు

భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌కు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానిస్తే, కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలు రద్దు చేసిందని సీఎం ఆరోపించారు. సదస్సుకు హాజరుకావాల్సిన దాదాపు 115 మంది విదేశీ ప్రతినిధులు వీసాలు పొందినప్పటికీ, కేంద్రం వారిని భారత్‌‌‌‌‌‌‌‌లోకి రాకుండా అడ్డుకుందని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ పోరాటాన్ని గమనిస్తున్నారని అన్నారు. ప్రశ్నలు అడగకూడదని భావించే ప్రధాని నియంతృత్వ ధోరణిని ప్రపంచం గమనిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సమ్మిట్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ప్రతినిధులు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ కోసం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయ విద్వేషాలు పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వాలు సామాన్యుల కోసం పనిచేయాలె

ప్రభుత్వాలు సంపన్నుల కోసం కాదు.. సామాన్యుల కోసం పనిచేయాలని సీఎం అన్నారు. తాము రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటే, ప్రత్యర్థులు నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, కేంద్రం సంపన్న మిత్రులను కాపాడుకుంటూ కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరిస్తోందని విమర్శించారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తాము కోరుకుంటుంటే, ప్రత్యర్థులు వనరులను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచీకరణ, కోవిడ్ తర్వాత అన్ని దేశాల్లోనూ ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్యం, ద్రవ్యోల్బణం వంటి ఒకే రకమైన సమస్యలు నెలకొన్నాయని వివరించారు. 

నెహ్రూ దార్శనికతతోనే బలమైన ప్రజాస్వామ్యం

భారత తొలి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు. నేడు దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత బలంగా ఉందంటే దానికి నెహ్రూ దార్శనికతే కారణమని కొనియాడారు. చర్చలు, సంప్రదింపుల ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని, కానీ కొందరు ఒకే వ్యక్తి ఆదేశాలతో పాలన సాగించాలని, అధికారాన్ని కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకరించాలని చూస్తున్నారని విమర్శించారు. ఒకే ఆలోచనా ధోరణి కలిగిన ప్రపంచ నాయకులు, మేధావులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు గొప్ప వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.
 
రాహుల్ పోరాటానికి అండగా నిలవాలె

ఓటు హక్కు పరిరక్షణ, దళిత, బహుజన, మైనారిటీల సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలో కొంతమందికే ఓటు హక్కు ఉండాలన్నది బీజేపీ ఆలోచన అని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది తమ ధ్యేయమని అన్నారు. ‘దేశంలోని పౌరులందరి ఓటు హక్కు కోసం, సామాజిక న్యాయం కోసం రాహుల్ పోరాడుతున్నారు. ఆయనకు మద్దతుగా నిలబడుదాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రపంచ శక్తులు ఏకం కావాలె’ అని పిలుపునిచ్చారు. సదస్సుకు హాజరైన 70 దేశాల ప్రతినిధులు హైదరాబాద్ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి, రాహుల్ గాంధీ నాయకత్వంలో మార్పు కోసం చేతులు కలపాలని కోరారు. ‘మీ కడుపులో విషం ఉండొచ్చు, కానీ దాన్ని రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా పెట్టొద్దు’ అని కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు.