న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాచి, గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో రాజకీయ దుమారం రేగింది. వాయు కాలుష్య కట్టడిలో విఫలమైందంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన ‘అబ్ కీ బార్.. 400 పార్’ నినాదాన్ని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రంగా సంధించారు. ఆ నినాదం ఎన్నికల్లో కాలేదు కానీ ఇప్పుడు ఢిల్లీ వాయుకాలుష్య సూచీ విషయంలో నిజమైందని, ఏక్యూఐ 400 మార్కును దాటి ‘తీవ్రమైన’ స్థాయికి చేరిందని ఎద్దేవా చేశారు.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా మారిపోయిందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ కాలుష్య కోరల్లో చిక్కుకుని చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రులలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య కట్టడిలో విఫలమయ్యాయని విమర్శించారు.
అధికారుల ఉన్నతస్థాయి సమీక్ష
క్షీణిస్తున్న వాయు నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కాలుష్యానికి సరిహద్దులు ఉండవని స్పష్టం చేసిన కేంద్రం.. పొరుగు రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడాన్ని అరికట్టడం వంటి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా రాష్ట్రాలను కోరింది.
