హైదరాబాద్: కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేట బొడ్రాయి సమీపంలో పార్క్ చేసి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం ఐదు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఆదివారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తొలుత ఒక బస్సులో మంటలు చెలరేగగా, పక్కపక్కనే ఇతర వాహనాలు పార్క్ చేసి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో మూడు బస్సులు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు వాహనాలు కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు.
మరోవైపు దుండిగల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
