చేర్యాల, వెలుగు: రైతుల గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు వాస్తవాలు తెలుసుకోవాలని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో నిర్వహించిన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చేర్యాల పట్టణంలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరుకాని పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రైవేట్ కార్యక్రమాలపై చూపిస్తున్న శ్రద్ధను రైతులకు సంబంధించిన కార్యక్రమాలపైనా చూపించాలని సూచించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులకు అండగా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం చిట్యాల, ముస్త్యాల, వీరన్నపేట, చుంచనకోట, కడవేరుగు, తాడూరు, గుర్జకుంట, రాంపూర్, పాత దొమ్మాట గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
