ఐటీ జాబ్స్ కు గుడ్‌బై చెప్పిన  జంట.. సొంతంగా ఫుడ్ బిజినెస్..9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం

ఐటీ జాబ్స్ కు గుడ్‌బై చెప్పిన  జంట.. సొంతంగా ఫుడ్ బిజినెస్..9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం

బెంగళూరు: మంచి జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు చేస్తున్న ఆ దంపతులు.. ఒక సాధారణ సమస్యకు పరిష్కారం వెతుకుతూ వ్యాపారవేత్తలుగా మారారు. ఇంట్లో వండినట్లుగా ఆరోగ్యకరమైన భోజనం అందుబాటులో లేకపోవడాన్ని గమనించి సొంతంగా ఫుడ్ స్టార్టప్ ప్రారంభించారు. కేవలం తొమ్మిది నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

బెంగళూరుకు చెందిన దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ చదివారు. అనంతరం ఒకే ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ప్రారంభించారు. అయితే ఉద్యోగాల బిజీలో ఇంట్లో వంట చేసుకునేందుకు సమయం దొరికేది కాదు. బయట ఆహారం ఆర్డర్ చేసినా.. ఇంట్లో వండినట్లుగా ఆరోగ్యకరమైన భోజనం దొరకడం కష్టమయ్యేది.

ఈ సమస్యకు పరిష్కారంగా ఇద్దరూ కలిసి ఫుడ్ సబ్‌స్క్రిప్షన్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 2024 సెప్టెంబర్‌లో తమ ఐటీ ఉద్యోగాలకు రాజీనామా చేసి 'వెల్‌ఫెడ్' (Wellfed) పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు.ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దంపతులు సుమారు రూ.15 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. మొదట ఆరుగురు సభ్యులతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు వ్యవస్థాపకులతో పాటు న్యూట్రిషనిస్ట్, వంటమనిషి, స్టీవార్డ్, డెలివరీ సిబ్బంది ఉన్నారు.ఆహారంలో పోషక విలువలు ఉండేలా న్యూట్రిషనిస్ట్ సహాయంతో మెనూను రూపొందించారు. తొలుత స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఆహారాన్ని అందించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

ఇంటి భోజనమే ప్రత్యేకత

వెల్‌ఫెడ్ మెనూలో పప్పు, ఆలూ గోబీ, జొన్న రొట్టె, అల్లం చికెన్, చోలే చాట్ వంటి వంటకాలు ఉన్నాయి. ప్రోటీన్ కోసం పనీర్, టోఫు, సోయా, చికెన్ వంటి పదార్థాలతోనూ ఆహారాన్ని అందిస్తున్నారు. వీటితో పాటు ర్యాప్స్, బిర్యానీలు, ఇండో-చైనీస్ వంటకాలు కూడా మెనూలో ఉన్నాయి.సోషల్ మీడియాలో ఓ బెంగళూరు న్యూట్రిషనిస్ట్ ఈ స్టార్టప్ గురించి వీడియో షేర్ చేయడంతో తొలి 100 మంది కస్టమర్లు వచ్చారు.

9 నెలల్లో రూ.56 లక్షల ఆదాయం

వెల్‌ఫెడ్ వ్యాపారం క్రమంగా విస్తరించింది. ప్రారంభించిన తొలి ఏడాదిలో సుమారు రూ.45 లక్షల ఆదాయాన్ని సాధించింది. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కేవలం తొమ్మిది నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయాన్ని నమోదు చేసింది.ఇప్పటివరకు 1,500 మందికి పైగా కస్టమర్లకు సేవలు అందించింది. మొత్తం 55 వేలకుపైగా భోజనాలను డెలివరీ చేసింది.

►ALSO READ | ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. దేశంలో 10 ఏళ్లుగా భయానక వాతావరణం: రాహుల్ గాంధీ

ఒక్కో భోజనం ధర ఎంతంటే?

  • కస్టమర్ల కోసం మూడు రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తోంది.
  • మూడు రోజుల ట్రయల్ ప్లాన్: ఒక్కో భోజనం రూ.289.
  • రెండు వారాల ప్లాన్: ఒక్కో భోజనం రూ.279.
  • నెలవారీ ప్లాన్: ఒక్కో భోజనం రూ.269.

ఈ ప్లాన్లలో లంచ్, డిన్నర్, ఉచిత డెలివరీతో పాటు న్యూట్రిషనిస్ట్ మార్గదర్శకత్వం కూడా అందిస్తున్నారు.

హైదరాబాద్‌లోనూ విస్తరించే యోచన

వ్యాపారాన్ని బెంగళూరులో మరింత విస్తరించడంతో పాటు వంటగది సామర్థ్యాన్ని పెంచాలని దంపతులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇతర నగరాల్లోనూ సేవలు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కూడా వారి పరిశీలనలో ఉన్న నగరాల్లో ఒకటిగా ఉంది. ఒక సాధారణ సమస్యను గుర్తించి దానికి వ్యాపార పరిష్కారం చూపిన ఈ జంట.. తమ ఆలోచనతో వేలాది మందికి భోజనం అందిస్తూ స్టార్టప్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.