దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణకు పోటీ లేదు: సీఎం రేవంత్

దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణకు పోటీ లేదు: సీఎం రేవంత్

హైదరాబాద్: దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణకు పోటీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి తెలంగాణ నెంబర్ వన్ స్టేట్‎గా నిలుస్తోందన్నారు. శనివారం (నవంబర్ 14) హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన PHFI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ మాస్టర్ ప్లాన్‎ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ క్యాంపస్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

వైద్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. త్వరలో మరిన్నీ హాస్పిటల్స్ రాబోతున్నాయని చెప్పారు. బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ప్రజలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని అన్నారు. మాకు పాలసీ పెరాల్సిస్ లేదని.. డే వన్ నుంచి మా పాలసీలను మెరుగుపరుచుకుంటున్నామని తెలిపారు. గత పాలకుల బెస్ట్ పాలసీలను మేం కొనసాగిస్తున్నామని.. ప్రజల అభివృద్ధి విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. 

హైదరాబాద్‎కు మరో ఓఆర్ఆర్

హైదరాబాద్‎కు ఔటర్ రింగ్ రోడ్డు గొప్ప వరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‎కు మరో ఓఆర్ఆర్ రాబోతుందని చెప్పారు. ఓఆర్ఆర్‎కు లోపల మరిన్నీ క్యాంపస్‎లు రాబోతున్నాయన్నారు. క్యాంపస్‎ల నిర్మాణాలకు సంబంధించిన అన్నీ అనుమతులు ఇచ్చామని తెలిపారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

పెట్టుబడిదారులు తెలంగాణకు క్యూ కడుతున్నారని.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తామన్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలు మరెక్కడా లేవన్నారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ చేసిన సంస్కరణలు తెలంగాణకు వరంగా మారాయని పేర్కొన్నారు. తెలంగాణకు ఫార్మా కంపెనీలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సేనని అన్నారు.