గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ముగ్గురు ఎమ్మెల్సీలకు సన్మానం

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ముగ్గురు ఎమ్మెల్సీలకు సన్మానం
  • గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌‌‌‌కు ముగిసిన పదవీకాలం

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌‌‌‌ల పదవీకాలం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌లో ఈ ముగ్గురికి ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. విరమణ అనేది కేవలం పదవికి మాత్రమేనని, ప్రజాసేవకు కాదని పేర్కొన్నారు. 

ఎమ్మెల్సీలుగా వారు అందించిన విశిష్ట సేవలను శాసనమండలి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు. భవిష్యత్తులోనూ వారికి మరింత ప్రజాసేవ చేసే అవకాశం రావాలని, అందుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చైర్మన్, స్పీకర్, ఇతర ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. అనంతరం ముగ్గురు ఎమ్మెల్సీలను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.