దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. నవంబర్ 20న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సాత్విక వీరవల్లి ఇలా ముచ్చటించింది.
‘‘యూఎస్‌లో ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసి, రెండేళ్లు జాబ్ చేశాక ‘కాంత’ చిత్రానికి ఆడిషన్ ఇచ్చా. దానికి ఎంపిక కాలేదు కానీ అదే నిర్మాత తీస్తున్న మరో తమిళ చిత్రానికి సెలెక్ట్ కావడంతో ఇండియా వచ్చేశా. ఆ తర్వాత ‘ఆకాశంలో ఒక తార’లో అవకాశం వచ్చింది. ఇందులో నాది ఇన్నోసెంట్ క్యారెక్టర్. అంతరిక్షంలోకి వెళ్లాలన్నదే తన లక్ష్యం. ఎవరెలా కించపరిచినా పట్టించుకోకుండా తన లక్ష్యం వైపే దృష్టి పెడుతుంది. ఫస్ట్ డే షూటింగ్‌లో చాలా టెన్షన్ పడ్డా.
దుల్కర్ చాలా సపోర్ట్ చేశారు. అలాగే శ్రుతి హాసన్, రుహాని శర్మల నుంచి చాలా నేర్చుకున్నా. యూఎస్‌లో పుట్టి పెరిగిన నాకు విలేజ్ అమ్మాయిగా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. స్కూల్ డ్రెస్ లో చూసుకుని సర్‌ప్రైజ్ అయ్యా. నా లైఫ్‌లో ఎప్పుడూ అనుభవించని ఒక పాత్రను ఎక్స్‌పీరియన్స్ చేయడం కొత్తగా ఉంది. ఆ పాత్రలో చాలా మ్యాజిక్ ఉంది. నటిగా అనేక పాత్రల్లో జీవించడం అనేది కేవలం సినిమా ఇచ్చే మ్యాజిక్. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు.
ఈ సినిమాలో ఓ అమ్మాయి విజయం వెనుక గొప్ప మనసున్న అబ్బాయి ఉంటాడు. నా దృష్టిలో ఇవి రెండూ ఉండాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తే జీవితం చాలా అందంగా ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా గొప్ప అనుభూతిని పంచుతుంది’’
