చెన్నై: తమిళనాడులోని మదురై తనిష్క్ షోరూమ్‌లో రూ.15 కోట్ల గోల్డ్ రాబరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యూట్యూబర్ నిశాంత్ తండ్రి సురేష్, గర్ల్ ఫ్రెండ్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనాక్షిని శనివారం (నవంబర్ 14) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నిశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు సుమారు 5 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
దోపిడీకి నిషాంత్ తన ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించుకోవడానికి మీనాక్షి సహకరించిదని.. అలాగే, చోరీ చేసిన నగలను తరలించడానికి తండ్రి సురేశ్ సాయం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నేరానికి పాల్పడినట్లు వీరిద్దరూ విచారణలో అంగీకరించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సురేష్, మీనాక్షి ఇద్దరూ దోపిడీలో తమ ప్రమేయాన్ని విచారణలో అంగీకరించినట్లు తెలిపారు.
షోరూమ్‌లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ షాఫ్ట్ మార్గం ద్వారా నిందితుడు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి శరీరంపై కనిపించిన టాటూ, అలాగే ఘటన తర్వాత తిరుప్పలై ప్రాంతం నుంచి మీనాక్షికి చేసిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు నిందితులను ట్రేస్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
తమిళనాడులోని మధురై తనిష్క్ జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 42 కేజీల బంగారు ఆభరణాలను దొంగలు దోచేశారు. 2026, నవంబర్ 11న మదురై బైపాస్ రోడ్డులో ఉన్న తనిష్క్ షోరూంలో ఈ భారీ దోపిడీ జరిగింది. రాత్రి వేళ ముసుగు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి సెక్యూరిటీ కళ్లు గప్పి షోరూమ్‌లోకి ప్రవేశించి, సుమారు 42 కిలోల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు సమాచారం.
ఎస్.ఎస్. కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ టీం.. షోరూమ్ ఉద్యోగుల వేలిముద్రలను సేకరిస్తూ, అక్కడ దొరికిన ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉద్యోగులు రోజూలానే గురువారం ఉదయం కూడా షోరూమ్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఈ భారీ దోపిడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దీపావళికి ముందు.. కేవలం 15 రోజుల క్రితమే ఈ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. షోరూమ్ వెనుక గోడ, తలుపులు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. మదురై నగర పోలీస్ కమిషనర్ ఎస్. రాజేంద్రన్, డిప్యూటీ కమిషనర్లు ఏజీ ఇనిగో దివ్యాన్, ఎస్. వనితలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
