హైదరాబాద్: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా నిందితులు పోలీసులకు పట్టుబడటంతో ఈ చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్లకంటి ప్రశాంత్ రావు అలియాస్ బంటి (19), రాచర్ల అఖిల్ (19) ఇద్దరూ స్నేహితులు. ఈ నెల 13న బండ్లగూడ జాగీర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, దొంగిలించిన యమహా RX 135 బైక్‌పై వెళ్తున్న వీరిద్దరిని పట్టుకున్నారు. అనంతరం విచారించగా నగరంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి సుజుకి యాక్సెస్ 125, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా RX 100, KTM డ్యూక్ 200, యమహా RX 135తో పాటు మరో ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నేరాలకు ఉపయోగించినట్లు భావిస్తున్న రివర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా సీజ్ చేశారు.
విచారణలో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడి పల్సర్ NS 200 బైక్ ప్రమాదంలో దెబ్బతినడంతో మరమ్మతుల కోసం సుమారు రూ.70 వేల అప్పు చేసినట్లు తెలిసింది. ఆ అప్పు తీర్చలేకపోవడంతో పాటు వ్యక్తిగత ఖర్చుల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరూ బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనకు సంబంధించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. వాహనాల చోరీ కేసును ఛేదించి, పది ద్విచక్ర వాహనాలను రికవరీ చేసిన రాజేంద్రనగర్ పోలీసు బృందాన్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ అభినందించారు.
