ఏపీలో తెలంగాణ IAS హనుమంతుకు రోడ్డు ప్రమాదం.. తిరుమల నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన

ఏపీలో తెలంగాణ IAS హనుమంతుకు రోడ్డు ప్రమాదం.. తిరుమల నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‎లో తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ హనుమంతు, ఆయన కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (నవంబర్ 14) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న కారు, స్కూల్ వ్యాన్ బలంగా ఢీకొన్నాయి. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ఘటనలో హనుమంతుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు నుంచి నెల్లూరు తరలించారు. ఐఏఎస్ హనుమంతు, ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. 

స్కూల్ వ్యాన్‌లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆసుపత్రికి వెళ్లి హనుమంతును పరామర్శించారు.  రాజీవ్‌ హనుమంతు ప్రస్తుతం తెలంగాణలో రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీగా ఉన్నారు.