టెక్సాస్: స్టార్‌షిప్ రాకెట్‌ను సురక్షితంగాభూమికి వెనక్కి రప్పించాలన్న స్పేస్-ఎక్స్ ప్రయత్నానికి శుక్రవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. టెక్సాస్‌లోని లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత, మొదటి దశ బూస్టర్ తిరిగి ప్యాడ్‌పైకి రావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో దానిని సముద్రం వైపు మళ్లించారు. దీంతో అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలి పేలిపోయింది. అయితే, ఈ ఆటంకం ఎదురైనప్పటికీ స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం భూకక్ష్యలోకి దూసుకెళ్లింది.
ఆర్బిట్‌లోకి చేరిన కొద్దిసేపటికే 26 అధునాతన స్టార్‌లింక్ ఉపగ్రహాలను ఈ వ్యోమనౌక ప్రవేశపెట్టింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 275 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ15సార్లు ప్రదక్షిణలు చేయనుంది. అవాంతరాలు తలెత్తకపోతే 22 గంటల ప్రయాణం తర్వాత శనివారం ఇది లాంచ్ ప్యాడ్ వైపు తిరిగి రానుంది. భూకక్ష్య నుంచి తిరిగి వస్తున్న వ్యోమనౌకను లాంచ్ టవర్‌కు అమర్చిన మెకానికల్ ఆర్మ్స్ సహాయంతో గాలిలోనే ఒడిసిపట్టేందుకు స్పేస్-ఎక్స్ ప్రయత్నించడం ఇదే తొలిసారి.
బూస్టర్ కూలిపోవడంతో రెండు భాగాలను ఒకేసారి ఒడిసిపట్టాలన్న స్పేస్ ఎక్స్ ఆశ నెరవేరలేదు. భవిష్యత్తులో రాకెట్లను రీయూజబుల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి భాగాన్ని సేఫ్‌గా వెనక్కి రప్పించాలన్నది స్పేస్-ఎక్స్ లక్ష్యం. చంద్రుడిపై స్థావరాల నిర్మాణం, మార్స్ యాత్రలకు ఇలా వేగంగా ప్రయోగాలు చేయగల రాకెట్టు అవసరమని స్పేస్ఎక్స్ భావిస్తోంది. అమెరికా, మెక్సికో సరిహద్దులోని స్టార్‌బేస్ వద్ద గతంలో మూడుసార్లు బూస్టర్లను విజయవంతంగా పట్టుకున్న నేపథ్యంలో శుక్రవారం నాటి వైఫల్యం ఆశ్చర్యం కలిగించింది.
