36 గంటల తర్వాత  మైక్రోసాఫ్ట్‌‌‌‌  సమస్య కొలిక్కి!

36 గంటల తర్వాత  మైక్రోసాఫ్ట్‌‌‌‌  సమస్య కొలిక్కి!
  •     ఔట్‌‌లుక్‌‌, టీమ్స్‌‌, కోపైలట్‌‌ సహా అన్ని సేవలు ప్రారంభం
  •     70కి పైగా దేశాల్లో వ్యాపార, విమాన సేవలకు అంతరాయం
  •     నెట్‌‌వర్క్‌‌ అప్‌‌గ్రేడ్‌‌లో సాంకేతిక లోపమే కారణమన్న సంస్థ
  •     సైబర్‌‌ దాడి, ఏఐ సమస్య కాదని స్పష్టీకరణ

 

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 70కిపైగా దేశాల్లో 36 గంటలకు పైగా తీవ్ర అంతరాయానికి కారణమైన మైక్రోసాఫ్ట్​లో టెక్నికల్​సమస్యను ఆ సంస్థ పరిష్కరించింది. సమస్యను గుర్తించిన వెంటనే టెక్నికల్ బృందాలు రంగంలోకి దిగి, ఆ కాన్ఫిగరేషన్ మార్పులను వెనక్కి తీసుకున్నాయి. క్రమంగా సర్వర్లను సాధారణ స్థితికి తెచ్చామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఔట్‌‌లుక్‌‌, మైక్రోసాఫ్ట్‌‌ టీమ్స్‌‌, కోపైలట్‌‌ సహా ‘మైక్రోసాఫ్ట్‌‌ 365’కు చెందిన ఇతర సేవలన్నీ పునరుద్ధరించినట్లు వెల్లడించింది. సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరికీ సంస్థ క్షమాపణ తెలిపింది.

మైక్రోసాఫ్ట్​లో ఏం జరిగింది?

కంపెనీ గతంలో చేపట్టిన కెపాసిటీ అప్‌‌గ్రేడ్​లో ఏర్పడిన టెక్నికల్​ సమస్య ఇటీవల చేసిన నెట్‌‌వర్క్‌‌ మార్పుతో బయటపడినట్లు మైక్రోసాఫ్ట్‌‌ వెల్లడించింది. దీంతో కొన్ని సర్వర్లు అందుబాటులో లేకుండా పోయాయని, మిగిలిన సర్వర్లపై ఒత్తిడి పెరిగిందని వెల్లడించింది. ఈ సమస్యలకు సైబర్‌‌ దాడితోగానీ, ఏఐతోగానీ సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. అయితే సర్వర్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంతోనే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అంతరాయం సమయంలో డెలివరీ కాని ఈ-మెయిల్స్‌‌ భారీగా పేరుకుపోవడంతో కొత్త సమస్య ఏర్పడింది. దీంతో ఈ -మెయిల్‌‌ టైమ్‌‌ ఔట్‌‌ గడువును 48 గంటలకు పెంచారు.

ఇండియాలో విమాన రాకపోకలపై ఎఫెక్ట్​

మైక్రోసాఫ్ట్​సమస్య భారత్‌‌లో ఇండిగో విమానయాన సంస్థపై ప్రభావం చూపింది. ఈ-మెయిల్‌‌ డెలివరీ కానీ ప్రయాణికులు వెబ్‌‌సైట్‌‌ లేదా యాప్‌‌ను వినియోగించాలని సూచించింది. ఇక ఓపెన్‌‌ ఏఐ, ఆంత్రోపిక్‌‌ సంస్థలు కూడా మైక్రోసాఫ్ట్‌‌ 365 కనెక్టర్లలో సమస్యలు ఎదురైనట్లు తెలిపాయి.