మియాపూర్, వెలుగు: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలో గల ఓ పెయింటింగ్ దుకాణంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన హీర్ సింగ్ నిర్వహిస్తున్న ఈ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పటాన్చెరు, కూకట్పల్లి ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంతోపాటు వెనక ఉన్న గోదాంలోని రూ.60 లక్షల విలువైన పెయింటింగ్ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఇతర భవనాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
