హైదరాబాద్, వెలుగు: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని, పెద్ద సంఖ్యలో వారు రాజకీయాల్లోకి రావాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్‌లో భారత్ సమిట్ రెండో రోజు సదస్సులో ‘తెలంగాణ రైజింగ్, యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో’ అంశంపై ప్యానెల్ డిస్కషన్ జరిగాయి. యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మనీష్ శర్మ మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ చర్చలో పలువురు మంత్రి, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
నిరంతర అధ్యయనం అవసరం: అజారుద్దీన్
రాజకీయాల్లోకి వచ్చే యువత నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని, సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు అని విశ్లేషించేందుకు కనీస విద్య అవసరమని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. క్రికెట్ మౌలిక వసతులు గతంతో పోలిస్తే మెరుగుపడినా.. హాకీ, ఫుట్‌బాల్ లాంటి ఇతర క్రీడలకు, గ్రామీణ, జిల్లాస్థాయి క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం కావాలన్నారు. హైదరాబాద్‌లో వసతి, ప్రయాణ సాయం, మెరుగైన శిక్షణ అందిస్తే అద్భుతాలు సాధిస్తారని, సీఎం రేవంత్ రెడ్డికి క్రీడలపై ఉన్న ప్రత్యేక ఆసక్తి యువతకు ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే బెస్ట్: జితేందర్ రెడ్డి
క్రీడలను వినోదంగా కాకుండా యువత అభివృద్ధి, ఉపాధి కల్పన, నాయకత్వ నిర్మాణ మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ–2025 దేశంలోనే అత్యుత్తమంగా ఉందని, ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే రూ.6 కోట్లు, రజతానికి రూ.4 కోట్లు, కాంస్యానికి రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17,274 గ్రామీణ క్రీడా మైదానాలు, మండల స్థాయిలో ఇండోర్ స్టేడియాలు, ఇంటర్ తర్వాత యువత కోసం ప్రత్యేకంగా ‘స్కిల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
విద్యార్థి ఎన్నికలు తప్పనిసరి: ఎంపీ అనిల్
కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను తప్పనిసరి చేయాలని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. స్కూల్ స్థాయి నుంచే ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తే స్థానిక, జాతీయ సమస్యలను అర్థం చేసుకుని సమర్థవంతమైన నాయకులుగా ఎదుగుతారన్నారు.
యువ ఎంపీల వాటా తగ్గింది: బ్రిజేంద్ర, మనీష్ శర్మ
లోక్‌సభలో 25 నుంచి 40 ఏళ్ల వయసున్న యువ ఎంపీల వాటా 1957లో 34 శాతంగా ఉండగా.., 2024 నాటికి అది 11 శాతానికి పడిపోవడం ఆందోళనకరమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు బ్రిజేంద్ర సింగ్ అన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిలిచిపోవడంతో కొత్త నాయకత్వం ఎదగడం లేదన్నారు. హర్యానా తరహాలో క్రీడాకారులకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ఇస్తే దేశం మరింత పురోగమిస్తుందని సూచించారు. దేశ జనాభాలో యువత వాటా 60 శాతం ఉన్నప్పటికీ, ఎంపీల సగటు వయసు 55 ఏళ్లుగా ఉండటం విచారకరమని మోడరేటర్ మనీష్ శర్మ పేర్కొన్నారు.
