- అమెరికాలోని మిస్సిస్సిపీ నదిలో ఘటన
న్యూఆర్లీన్స్: అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూఆర్లీన్స్‌లో ఓ క్రూయిజ్ షిప్ ను మరో ట్యాంకర్ నౌక ఢీ కొట్టింది. మిస్సిస్సిపీ నదిలో ప్రయాణిస్తుండగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 32 మంది గాయపడ్డారు. వారందరినీ తక్షణమే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోర్టు అధికారుల కథనం ప్రకారం.. 129 మంది ప్రయాణికులతో వెళ్తున్న ‘అమెరికన్ హెరిటేజ్’ పాడిల్ షిప్ను శుక్రవారం మధ్యాహ్నం అదుపుతప్పిన ‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ ట్యాంకర్ నౌక ఢీకొట్టింది.
ప్రయాణికులను దించేందుకు డాక్ వద్దకు చేరుకుంటున్న సమయంలో ప్రమాదం జరగడంతో షిప్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోయింది. వెంటనే షిప్‌లోని ప్రయాణికులు నీటిలో పడిపోయారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేర్చారు.
పోర్టు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పోర్టు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. ప్రమాద తీవ్రత కారణంగా నదిలో నౌకల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ట్యాంకర్ అదుపుతప్పడానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
