మల్కాజ్గిరి, వెలుగు: వివాదంలో ఉన్న భూమిని ఎటువంటి సమస్యలు లేవని అమాయకులకు నమ్మబలికి, ప్లాట్లుగా విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఓ భూ కబ్జాదారుడిపై మల్కాజ్గిరి పోలీసులు పీడీ యాక్ట్ప్రయోగించారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన పంజాల జైహింద్ గౌడ్ ను శుక్రవారం అరెస్ట్‌చేసి, చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు.
రాంపల్లిలోని సర్వే నంబర్ 268, బ్లాక్ ఇ పరిధిలోని 10 ఎకరాల 08 గుంటల వివాదాస్పద భూమికి సంబంధించి నిందితుడు తన అనుచరుడు రాజా లింగారెడ్డితో కలిసి కుట్రకు పాల్పడ్డాడు. ఈ భూమిపై రిజిస్టర్డ్ సేల్ డీడ్ పొందిన జైహింద్ గౌడ్, తొలుత దానిని రతన్ లాల్, ముఖేశ్అగర్వాల్లకు విక్రయించాడు. అయితే, ఆ భూమిపై ముందే వివాదం ఉన్నట్లు తెలుసుకున్న కొనుగోలుదారులు దాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో, వారి మధ్య రాజీ కుదిరి సేల్ డీడ్ రద్దయింది.
సేల్ డీడ్ రద్దయినప్పటికీ, నిందితుడు కక్షపూరితంగా అదే వివాదాస్పద భూమిలో అనధికారికంగా లేఅవుట్ వేశాడు. ప్లాట్లకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవంటూ తన ఏజెంట్ల ద్వారా కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించి పలువురిని మోసం చేశాడు. ఈ క్రమంలో 2026లో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడి నేరాల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న మల్కాజ్గిరి సీపీ సుమతి పీడీ చట్టం ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు ప్లాట్లు కొనే ముందు భూమికి సంబంధించిన అన్ని న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని పోలీసులు సూచించారు.
