పద్మారావు నగర్, వెలుగు: రౌండ్ టేబుల్ ఇండియా - ఏరియా 9 ఆధ్వర్యంలో 3 వేల మందికి పైగా దివ్యాంగ చిన్నారులతో శనివారం నిర్వహించిన తారే జమీన్ పర్ పెయింటింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు సాయి దుర్గ తేజ్, ఈషా రెబ్బా, అషు రెడ్డి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ హాజరై చిన్నారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ ఇండియా - ఏరియా 9 చైర్మన్ అనిరుధ్ సోంపల్లి మాట్లాడుతూ.. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశమని, చిన్నారుల చిరునవ్వులే తమకు అతిపెద్ద విజయమన్నారు. లేడీస్ సర్కిల్ ఇండియా సహకారంతో పెయింటింగ్ పోటీలతోపాటు మ్యాజిక్ షో, డీజే, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ సిద్ధార్థ్ , ఈవెంట్ మెంటార్ దర్శీల్ షా, ఆర్టీఐ వీక్ కన్వీనర్ లోకేశ్వర్ రెడ్డి, న్యాయనిర్ణేతలు మందాకిని రావు, తులసి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
