వెలుగు స్పెషల్: రాజకీయ తెరపై సోనియా ప్రేమకథ..!

వెలుగు స్పెషల్: రాజకీయ తెరపై సోనియా ప్రేమకథ..!

‘సొంతమవుతూ .. ప్రేమ ప్రయాణం’ (బిలాంగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎ జెర్నీ ఆఫ్ లవ్) ‘రాజకీయం కాదు, ఇది కుటుంబ కథ’ అని రచయిత్రి సోనియా గాంధీ తన ఆత్మకథలో స్పష్టం చేసినప్పటికీ, రాజకీయ తెరపై విరుద్ధ భావనలు, బహిరంగ వ్యాఖ్యలు సాగుతూనే ఉన్నాయి.  చరిత్రగతిలో  రేగిన పలు సందేహాలకు సమాధానాలివ్వడమేకాక  వివిధ రాజకీయ దుష్ప్రచారాలకు ఈ పుస్తకం అడ్డుకట్ట వేసిందని కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. తప్పుల్ని కప్పిపుచ్చి, తమ చర్యల్ని సమర్థించుకునేందుకు చేసిన ఓ ప్రయత్నం అని ప్రత్యర్థి బీజేపీ వర్గం విమర్శిస్తోంది. 

కొన్ని విషయాలే వివరంగా రాసి, మరిన్ని కీలక, వివాదాస్పద అంశాల్ని ప్రస్తావించకపోవడం ‘సౌకర్యవంతమైన ఆత్మకథా కథనం’అని ప్రత్యర్థుల వాదన.  పుస్తకాన్ని స్థూలంగా పరిశీలించినపుడు... ప్రేమను కేంద్రకం చేసి, కుటుంబ బంధాలు, స్నేహాలు, జీవితపు ఆటుపోట్లు, త్యాగం, బాధ్యత వంటి వైరుధ్యాల నడుమ సంఘర్షణ,  అనివార్యతలు తదితరాలను హృద్యంగా మలిచిన తీరు ప్రశంసనీయం. ఎంతకాదన్నా, కుటుంబం-రాజకీయం మేళవింపు ఓ అర్ధ శతాబ్ది చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం!

భారతదేశ ప్రత్యక్ష రాజకీయాల్లో  మూడు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్న సోనియాగాంధీ తన ఆత్మకథను ఓ పెద్ద పుస్తకంగా (636 పేజీలు) గత సోమవారం విడుదల చేయడంతో ఎన్నో విషయాలు ప్రజాక్షేత్రంలోకి వచ్చాయి.  ఇటలీకి చెందిన ఓ యువతి, దేశంలోని అత్యున్నత రాజకీయ (గాంధీ, నెహ్రూ) కుటుంబ యువకుడ్ని తాము చదువుకుంటున్న కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రేమించి దేశపు కోడలిగా రావటం వరకే ప్రజలకు తెలుసు.

అదే క్రమంలో దేశ ప్రధానిగా ఉన్న అత్త ఇందిరాగాంధీ, తర్వాత కాలంలో మాజీ ప్రధాని,  భర్త రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ హత్యలకు గురికావడం, అయిష్టంగానే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం,  దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని ఆమె వదులుకోవడం, ఆమె సంతానం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేడు విపక్షంలో క్రియాశీల నేతలుగా ఉండటం వంటివి బయటకు కనిపించే విషయాలు. 

కానీ, వాటి వెనుక ఎప్పుడు, ఏం జరిగింది?  ఎవరి పాత్ర,  ప్రమేయం ఎలాంటివి?  ఏయే పరిస్థితుల్ని సోనియా ఎలా ఎదుర్కొన్నారు.... ఇలాంటి విషయాలు స్వయంగా ఆమే వివరించడం ఆసక్తి రేపుతుందనడంలో ఆశ్చర్యం లేదు. రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వచ్చిన బోఫోర్స్ కుంభకోణం విమర్శలు, ఇటలీ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సోనియా కుటుంబంపై వచ్చిన నిర్దిష్ట ఆరోపణలకు తనదైన స్పష్టత ఆమె ఇచ్చి ఉండాల్సిందనే వాదన రావడమూ సహజమే.

పౌరసత్వ సందేహాల్ని తీర్చే యత్నం

తానే స్వయంగా ఆత్మకథ రాయడం వెనుక మతలబు సోనియా వివరించారు. ‘నీ ఆలోచనలు రాయి’ అన్న పలువురు సన్నిహితులు, ‘ఇప్పటికే నీపై చాలా పుస్తకాలు వచ్చినా వేటిలోనూ మేమెరిగిన నీవు లేవు’ అనేవారని దాన్ని నేను చివరకు అంగీకరించానని పుస్తకం ముందు మాట (ప్రోలోగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో) ఆమె  చెప్పుకొచ్చారు. ‘నాది రాయదగిన కథే, రాసే సమయం వచ్చింది’ అని తాను భావించానని, అందుకే రాశానని  స్పష్టం చేశారు. ‘ఇది రాజకీయ కథనం కాదు,  ప్రేమతో కూడిన కుటుంబ కథ’ అనీ స్పష్టం చేశారు.  చట్టబద్ధంగా పౌరసత్వం పొందిన వ్యక్తిగానేకాక, ఈ దేశాన్నే తన ఇల్లుగా మార్చుకొని, దేశ ప్రజలకు చెందిన వ్యక్తిగా మారిన క్రమాన్ని ఈ పుస్తకం ద్వారా వివరించేందుకు ఆమె యత్నించారు. 

1999లో జరిగిన ఒక భేటీలో, దేశ అత్యున్నత పదవికి తన యోగ్యతను ప్రశ్నిస్తూ సీనియర్ నాయకులు శరద్ పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మాలు పార్టీని వీడినపుడు తాను ఎంతో నొచ్చుకున్నానన్నారు. ఆ పదవికి యోగ్యత అంశం ప్రశ్నించినందుకు కాదని, తాను వారిని విశ్వాసంలోకి తీసుకున్నా వారు తనను విశ్వసించకపోవడం బాధించినట్టు సోనియా చెప్పారు.  ప్రపంచ యుద్ధంలో ఇటలీ సైనికుడిగా గ్రీస్,  రష్యాల్లో పోరాడిన తన తండ్రిపై  ప్రేమవల్ల ఇటలీ పౌరసత్వం వదులుకోవడం కష్టమైందనీ తన మనోగతం వెల్లడించారు.

సహేతుక వారసత్వం

రాజకీయ ప్రత్యర్థులు విమర్శించే ‘వారసత్వ రాజకీయాల’ పైనా సోనియా ఒక స్పష్టత ఇచ్చారు. రాజకీయాల్లోకి రావద్దని రాజీవ్ గాంధీని తాను వ్యతిరేకించినంత గట్టిగానే, తన పిల్లలు రాహుల్, ప్రియాంకలు తననూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావద్దని వ్యతిరేకించారన్నారు.  తాను రావాల్సిన అనివార్యతను రాజీవ్ గాంధీ వివరించినప్పటి కన్నా, ఆయన త్యాగం అర్థమైనపుడు కొంత, తాను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినపుడు మరికొంత అర్థమైందని సోనియా వివరించారు. అందువల్లే, రాహుల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినపుడు తాను ప్రతిఘటించలేకపోయానన్నారు. 

అత్త, భర్త  ప్రాణత్యాగాల వల్ల ఏర్పడ్డ వ్యక్తిగత భయాలు, 1997లో పార్టీలో చేరి బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం మధ్య తనలో తీవ్ర ఆంతరంగిక సంఘర్షణ జరిగినట్టు తెలిపారు. స్వీయ భయాలకన్నా.. అత్త, -భర్త త్యాగాల్ని వృథాపోనీయకుండా నిర్వహించాల్సిన సహేతుక వారసత్వం వైపే తాను కడకు మొగ్గానన్నారు. ఆ సంఘర్షణ తాలూకు తుది నిర్ణయమే 2004లో ‘ఆత్మప్రబోధం’ ప్రకారం ప్రధాని పదవి నిరాకరించడానికి కారణమైనట్టు తెలిపారామె.  

ప్రధానమంత్రి కావడానికి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తి కనబరిచినా డా. మన్మోహన్ సింగ్ వైపే మొగ్గడానికి గల కారణాల్నీ ఆమె పుస్తకంలో వివరించారు. కానీ, కాంగ్రెస్ రెండుమార్లు అధికారంలోకి రావడంలో కీలక విజయాలు అందించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, దుర్ఘటనలో మరణించేవరకు పార్టీకి ఎంతో సేవచేసిన రాజీవ్ సన్నిహితుడు రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ వంటి వారి ప్రస్తావన ఎక్కడా లేకపోవడం పాఠకుల దృష్టి నుంచి జారిపోదు.

కొన్ని పాక్షిక వ్యక్తీకరణలే!

కీలకమైన కొన్ని వివాద, సందేహాస్పద అంశాల్ని వదిలేశారనే విమర్శ ఉంది. సంత్ లోంగోవాల్ హత్య, ఖలిస్తాన్ వాదులు కెనడా నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేయడం, జనరల్ వైద్య హత్యోదంతాలను తటస్థంగా, ఒక జర్నలిస్ట్ కథనంలాగా సోనియా వెల్లడించారు. ఎమర్జెన్సీ, బాబ్రీ మసీదు కూల్చివేత, అయోధ్య శిలాన్యాస్, గుజరాత్ అల్లర్లు, షాబానో కేసు, సీతారామ్ కేసరి తొలగింపు, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, బోఫోర్స్ కుంభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోణం కేసు తదితరార అంశాల్ని ఆమె దాట వేశారనే విమర్శ ఉంది.  అన్నీ చెప్పడంలో కొన్ని పరిమితులున్నాయి. ఎందుకంటే, ఇతరుల వ్యక్తిగత గోప్యతను నేను గౌరవిస్తాను. అవేమైనా ఉంటే, వారు వారి కథల్లో చెప్పుకోవచ్చు అనే భావన సోనియా వ్యక్తం చేశారు. 

ఇటలీ యువతిగా తన దేశాన్ని వీడి వచ్చి, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దత్తత తీసుకున్న నుంచీ తాను భారతీయతను ఎంతగా జీర్ణం చేసుకున్నది చెప్పే ప్రయత్నం పుస్తకం పొడుగునా సాగింది.  కూతురు ప్రియాంకలో చురుకైన, ఇందిరా వారసత్వ రాజకీయ లక్షణాలున్నాయని బయట ఎంత ప్రచారమున్నా తనయుడు  రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే  రాజకీయ ప్రాధాన్యతనిస్తూ ఆమె ‘సగటు భారతీయత’ను ఆచరణలో చాటుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత  కాంగ్రెస్  ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని విభజించి ‘తెలంగాణ’ ఇచ్చిన విషయాన్ని పుస్తకంలో ప్రస్తావించలేదని బీఆర్​ఎస్ నాయకుడొకరు తప్పుబట్టారు. 

కానీ, ఆమె ఇవ్వలేదు అని అనలేని పరిస్థితి వారిది. ఎందుకంటే, ఆ పార్టీ అధినేత కేసీఆర్ 2005 బడ్జెట్ సమావేశాలప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి, ‘తెలంగాణ ఇస్తానని సోనియా స్వయంగా నాకు చెప్పారు, మాట ఇచ్చి సోనియా తప్పిన సందర్భం చూడలేదు, కనుక రాష్ట్రం ఏర్పాటు ఖాయం’ అని నాతోనే అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోనియాకు ఇస్తూ కేసీఆర్ అసెంబ్లీ వేదికపైనే మాట్లాడారు.

రాజకీయంగా విఫలమయ్యా

మనమెంత నష్టపోయామన్నదానితో నిమిత్తం లేకుండా రాజకీయాల్లో ‘నిజాయితీ’గా నిలబడటం అతి పెద్ద సవాల్ అని చెప్పిన సోనియా, ‘అంతిమంగా ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తెచ్చాం,  ఏమేర వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం’ అన్నదే కొలమానమని రాజీవ్ చెప్పిన మాటలు తనకు సదా స్ఫూర్తి అన్నారు. బాధ్యతగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేతృత్వం వహించి, గరిష్టంగా కృషి చేసి కూడా దేశ లౌకిక, సమైక్య, బహుళత్వానికి వ్యతిరేకంగా చెలరేగే శక్తుల్ని అణచివేయడంలో తాను విఫలమైనట్టు ‘ముగింపు’ (ఎపిలోగ్) మాటల్లో వెల్లడించారు. 

కానీ, అంతిమంగా ఈ మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో ప్రేమ, దయ గెలిచి, నిలుస్తాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యక్తి, కుటుంబం, దేశం తానెంతగా ప్రేమించానో, బదులుగా తననూ అంతే ప్రేమించాయని, ‘ప్రేమ’తననెప్పుడూ విఫలం చేయలేదని ఆమె తన ప్రేమ కావ్యం ముగించారు.

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected]
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
  • రచన 700 పదాలకు మించరాదు.