ప్రపంచమంతా సోనియా గాంధీ ‘బిలాంగింగ్. ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆత్మకథ గురించి చర్చించుకుంటున్న దశలో నా ‘శూద్ర జీవితం’ ఆత్మకథ తెలుగు పుస్తకం బయటికొచ్చింది. 15 నవంబర్ ఆదివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇద్దరు శూద్ర స్త్రీలు నన్ను ఇంటరాగేట్ చేయబోతున్నారు. ఇట్లాంటి టైటిల్‌తో, ఇట్లాంటి బతుకు గురించి ఎందుకు రాశావు? దీన్ని ఎవరు చదువుతారు అని?
9–10 ఏండ్ల వరకు గొర్లతో, బర్లతో ప్రకృతిలో స్వేచ్ఛగా పోరాడుతున్న నన్ను ఊరికి కొత్తగా వచ్చిన ప్రభుత్వ పంతులు బలవంతంగా బడిలో చేర్పిస్తే ఆ పంతుల్ని కొట్టో, తిట్టో పారిపోవాలని నేను ఎందుకు అనుకున్నాను? పగపట్టిన పాములతో పుట్టచుట్టూ పరుగెత్తి, ఎదకొచ్చిన ఆవులతో ఉరికి, ఉరికి ఆరాటపడుతున్న కోడెలను ఆపే ప్రయత్నించి, పాతగోడల అర్రలో కూర్చుని పంతులు నిరంతర కనుసైగల్లో అక్షరాలను దిద్దుతుంటే నాకెందుకు రోత, భయం వేశాయి? బ్రాహ్మణుల చదువు దేవత సరస్వతి, నన్ను దయ్యమైపట్టి చంపుతుందనే భయం నన్ను ఎందుకు వెంటాడింది? చివరికి ఇంగ్లిష్ నాకు దేవత ఎట్లైంది? సంస్కృతం ఎటూరాదు, తెలుగు కూడా అసలే రాదనుకునే గొర్ల– బర్ల కాపరికి ఇంగ్లిష్ భారతీయ భాషగా మారిస్తే మెదడులోకే కాదు, నరనరానికి ఎట్లెక్కింది?
పెండ్లిపిచ్చి లోకంలో చదువు పిచ్చి
నేను బతుకుతున్న ఊళ్లలో 15 ఏండ్లకే పెండ్లిపిచ్చి పోర గాండ్లకు, తల్లిదండ్రులకుండగా మరి నాకు చదువు పిచ్చి ఎందుకెక్కింది? అది జీవితాంతం ఉండేటట్టు ఎలా ముదిరింది? దేశభాషగాని సామ్రాజ్య దోపిడీ భాష అని కమ్యూనిస్టు పండితులతో సహా ద్వేషించుకున్న భాష నాకు ఇంటిభాషగా కాకపోయినా ఒంటిభాషగా ఎట్లా ఎక్కింది? నువ్వు నేను బతికుండగా పెండ్లి చేసుకోకపోతే సచ్చిపోతానని మా అయ్య బెదిరిస్తే సచ్చినాసరేగాని పెండ్లి చేసుకోను, చదువుతోనే సావాసం చేస్తా అని ఎందుకు కాలేజీ బాట పట్టిన? అన్న ఆసరాతో హైదరాబాద్‌లో పెండ్లిపోరు లేకుండా ఎంఎ, ఎం.ఫిల్ తరువాత బుద్ధుని రాజకీయ తత్వంపై పీహెచ్‌డీ ఎట్ల చేసిన? ఆ దశ నుంచే ప్రత్యర్థులను శత్రువులుగా కాకుండా జ్ఞానరంగంలో పోటీదారులుగా ఎందుకు చూసిన?
పుస్తక ప్రేమ–సెక్స్ ప్రేమ
ఊరి నుంచి వచ్చిన ఎంతోమంది అగ్రకుల, ధనిక అమ్మాయిలు క్లాసులో, బయట ఉంటే బాల్యపెండ్లిని తప్పించుకున్న నేను పుస్తక ప్రేమ–సెక్స్ ప్రేమ మధ్య నలిగిపోయిన్నా! ఓడిపోయిన్నా! గెలిసిన్నా? 74వ ఏట వెనక్కి తిరిగి చూస్తే ఈ దారిలో నేనేమైన? ఎందులో గెలిసిన, ఎందులో ఓడినా? సెక్స్ ప్రేమ, పుస్తక ప్రేమ రెండు పరస్సర విరుద్ధాలా? రెంటిని కలిపి నడిపించిన ఒక మార్స్‌లా ఈ దేశంలో, నా కులం నుంచి వచ్చి, నా అందరహిత ఆకారంతో ఆరునెలలకే అమ్మతల్లి ముఖంమీద పొలిసిన పొక్కులు, 3 సంవత్సరాలకే చలిమంట అంటుకుని కాలిన ముఖం ఏ రంగంలో రాణించగలదు?
పుస్తక ప్రేమ ఏం మిగులుస్తుంది?..సెక్స్ ప్రేమ ఏం మిగులుస్తుంది?
ఈ మధ్యనే నోబెల్ గ్రహిత వెంకి రామకృష్ణ రాసిన ‘వై ఉయ్ డై’ పుస్తకంలో సెక్స్ ప్రేమ మన జీన్స్‌ని తరాలకు, తరాలకు వేల ఏండ్లు అందిస్తుంది? ఇప్పుడు నాలో కూడా వేల ఏండ్ల నా ముందు తరాల జీను ఉంది. లేకపోతే నేను లేను. నా శరీరంలోని జీన్స్ హరప్పా నగర నిర్మాణాల కుల జీన్స్ నుంచి అంతకుముందు నుంచి వచ్చినవి.
మరి సెక్స్ ప్రేమను కాదని పుస్తక ప్రేమలోపడితే నా చావు అనంతరం ఏమి మిగులుతుంది? నాలాగా ఓ జీన్ జీవ సంఘర్షణలో పాల్గొనకుండా పుస్తక పఠన, రచనలో బతికి నేను నన్ను ఏం చేసుకున్నట్టు? నేను ఈ మధ్య రాసిన హరప్ప: గాడ్స్ సిటీ ఆఫ్ సివిలైజేషన్ నవల్లో రాసినట్టు హరప్ప ఆయన భార్య మైసమ్మ నాకు కూడా పూర్వీకులు కదా? వై ఐ టూ డై? రామకృష్ణన్ రాసినట్టు ‘ఐ టు విల్ డై’ తరువాత నా నిశాన్ ఏంటి? ఆ నిశాన్ మానవరూపంలో కాకుండా కూడా ఉండవచ్చా?
నేనొక నిరంతర భయస్తుణ్ని..
గొర్ల– బర్ల కాసేటప్పుడు పాము కర్సి సంపుతుందేమో అని భయం, బడికిపొయ్యాక సరస్వతి గొంతు పిసికి చంపుతుదేమో అని భయం, పాపయ్యపేట నుంచి గూడూరుకు (10 కిలోమీటర్ల దూరం) ఆరో తరగతి చదువు కోసం పోయేటప్పుడు తొవ్వలో ఉన్న మైసమ్మ పట్టి సంపుతుందేమోనని భయం. భయం నుంచి బయటపడేందుకు పామును చంపాలని ప్రయత్నం, సరస్వతి భయం నుంచి బయటపడేందుకు ఆమెకు అర్థంగాని ఇంగ్లిష్ నేర్చుకోవాలని ప్రయత్నం, మైసమ్మ భయం నుంచి బయటపడేందుకు ఆమెకోసం దారిలో కొట్టిపడేసిన కొబ్బరి కాయ తినాలని ప్రయత్నం ఎలా చేశాను.
కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో నా పేరు (ఐలయ్య) నాకే అసహ్యం కలిగించే భయం. అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలంటే భయం (అన్ని మచ్చలు, బొక్కలు) నా పేరు భయం నుంచి బయటపడేందుకే ఐజయ్య బెర్లిన్ అనే ఫిలాసఫర్ని పట్టుకున్నాను. నా ముఖంలో అందాన్ని వెతకడానికి బదులు అద్దాన్ని ఇంగ్లిష్ మాట్లాడే స్టైల్ ప్రాక్టీస్ చేసేందుకు వాడుకునేవాడిని. నా ముఖాన్ని మార్చలేను. కానీ నా మెదడును నేను మార్చగలను.
నా మెదడులో పుట్టిన ‘ఐడియా’ను కొన్ని వందల సంవత్సరాలైనా బతికించాలనే ఆరాటం. మన శరీరంలో జీన్ ముటేషన్ నెగెటివ్‌గా మారుతుంది. కానీ మెదడు ఉత్పత్తి చేసిన ‘ఐడియా’ ముటేషన్ వల్ల మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే ‘ఐడియా’ను ఎక్కువ మందితో పంచుకోవాలనే ప్రయత్నం.
పౌర హక్కుల ఉద్యమంలో ఇన్‌ఫీరియారిటీ భయం
ఉద్యమం ఉత్పత్తి రంగం కాదు. అది ఉత్పత్తి రంగంలో ఉన్నవారిని, భయాల నుంచో, బాధల నుంచో కాపాడటానికి సోకాల్డ్ మేధావుల నాయకత్వంలో నడుస్తుంది. 1980–90 దశకంలో పౌరహక్కుల ఉద్యమాల్లోని నాయక మేధావులంతా బ్రాహ్మణులే, చదువు, ఇంగ్లిష్ భాషపై పట్టు వారి సుపీరియారిటీకి మూలం. అయితే కులం జాగ్రత్తగా, అంతర్లీనంగా అందులో నాయకత్వ స్థానాలను కాపాడుకోవడానికి నిరంతరం వాడటం జరుగుతుంది. నా జ్ఞానాన్ని, నా ఇంగ్లిష్‌పై పట్టును వాళ్లు ఎన్నడూ గౌరవించేవాళ్లు కాదు. వాళ్ల ఉపన్యాసాలు, వారి రచనలే వారి మధ్య చర్చనీయాంశం.
శూద్రులు, రెడ్లా, చాకల్లా, కురుమలా అనే తేడా లేకుండా ఇన్‌ఫీరియర్ మనుషులే. అక్కడ నేనొక నిరంతర ఇన్‌ఫీరియర్ బీయింగ్‌ని. ఆ భయం నుంచి ఎలా బయటపడాలో నాకు తెలిసేది కాదు. ఈ దశలోనే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, హిందూత్వ శక్తులు నాకొక మేలు చేశాయి. అవి ‘మనమంతా హిందువులం’ అని నినాదమిచ్చాయి. ఈ నినాదం నాలో మరో భయాన్ని కలిగించింది. నా గొర్ల కాపరికం హిందువా? మా బీరప్ప దేవుడు హిందువా? మా పోచమ్మ దేవత హిందువా? అనే పిచ్చి ప్రశ్నలు నాలో రేకెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నిర్మాణాలు ప్రశ్నకు, అనుమానానికి వ్యతిరేకం.
అవి నమ్మకాన్ని మనుషుల్లో నాటుతాయి. అప్పుడే రహస్యంగా, నా పౌరహక్కులు సుపీరియర్ జ్ఞానవంతులకు కూడా తెలవకుండా ‘వై అయామ్ నాటే హిందూ’ పుస్తకం రాశాను. ఇది ఆర్‌ఎస్ఎస్, బీజేపీ భయాన్ని, పౌరహక్కుల సంఘాల్లో ఇన్‌ఫీరియర్ భయాన్ని ఎదిరించడానికి నేను చేసిన పని. దాన్ని రాశాక నాతోటి శూద్ర మిత్రులే గిదేం పుస్తకం? అందులో విదేశీయుల కొటేషన్లు లేవు, స్వదేశీయుల సంస్కృతి లేదు అని ఎద్దేవా చేశారు. మళ్లీ కొత్త భయం. దీన్ని ఎవరు ప్రింట్ చేస్తారు? చేస్తే ఎవరు చదువుతారు? అని ఈవిధంగా భయాల నుంచి బయటపడేందుకు, ఊళ్లు తిరుగుతూ బ్రాహ్మణ, బనియా వంటి మేధావులెవ్వరికీ తెలవని, అర్థంకాని ఉత్పత్తి ఫిలాసఫీని రాసుకుంటూ, చదువుకుంటూ ఇక్కడికొచ్చాను.
ఏం తిన్నాను, ఎట్లా బతికాను, ఎట్లా చస్తాను
అఫీషియల్ తేదీ ప్రకారం74 ఏండ్లు ఏం తింటే, ఎవరు పెడితే, ఎవరు నాకు అండగా ఉంటే ఈ పనులు చేస్తూ వచ్చాను, ఇంతవరకు బతికాను అనే అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. రామకృష్ణన్ లేవనెత్తిన ‘వై వి డై’ ప్రశ్నకు ‘ వై బికాస్ వి ఆర్ బార్న్’. అయితే నేను సచ్చినాక నా శరీరాన్ని బొంద పెట్టాలని, కాల్చొద్దని, ఇంటివారికి, బయటవారికి చెప్పాను. ఈ పుస్తకంలో కూడా రాశాను. ఎందుకు? చనిపోయిన శరీరాన్ని బొందపెడితే అది కొన్నిసార్లు తిరిగి లేస్తుంది (రిసరక్షన్) అని కొంతమంది మానవులు నమ్ముతారు. వారి శరీరం, ఆత్మ వేరుకాదు అని నమ్ముతారు.
శరీరాన్ని కాలబెట్టాలనేవారు శరీరం బూడిదైనా, ఆత్మ నిరంతరంగా ఉంటుంది అని నమ్ముతారు. నేను శరీరం, ఆత్మ వేరని నమ్మను. శరీరంలోని గుండె బతికిస్తే మెదడు సుదీర్ఘకాలం ఉండే ఆలోచనలను అందిస్తుంది. బొందపెట్టిన తరువాత నా శరీరం లేసి వస్తుందా లేదా ముందు తరాల సమస్య. కానీ నా మెదడు మాత్రం బతికే ఉంటుంది. మనిషి పునర్జీవనం (రిసరెక్షన్) అనే ఐడియా మీద ప్రపంచ దేశాల్లో చాలా చర్చ జరుగుతున్నది.
మెదడు మాట్లాడిన మాటలు, రాత రూపంలో ఆ మాటలు ప్రజల ముందున్నంతవరకు ఆ మనిషి జీవించి ఉన్నట్టే అనే అభిప్రాయం ఉంది. అంటే నా మరణానంతరం నా జీన్ బతికి ఉండదు. కానీ నా మెదడు బతికి ఉంటుంది. బహుశా అది 21వ శతాబ్దపు మొదటి శూద్ర మెదడు. శూద్రులు ఈ దేశ నిర్మాణంలో ఏం చేశారో చెబుతుంది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
