రాహుల్ హామీ నిలబెట్టాం.. గిగ్ వర్కర్ల చట్టం పక్కాగా అమలయ్యేలా చర్యలు: మంత్రి వివేక్

రాహుల్ హామీ నిలబెట్టాం.. గిగ్ వర్కర్ల చట్టం పక్కాగా అమలయ్యేలా చర్యలు: మంత్రి వివేక్
  • త్వరలో హమాలీ బోర్డు.. గృహ కార్మికులకూ పథకాలు
  • తన తండ్రి కాకా పెన్షన్ విధానాన్ని గుర్తుచేసుకున్న వివేక్
  •  సర్కార్ జోక్యంతో మళ్లీ యాక్టివేట్: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ప్రత్యేక జోక్యంతో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన దాదాపు 16 వేల మంది గిగ్ వర్కర్ల బ్లాక్ అయిన ఐడీలను పునరుద్ధరించి మళ్లీ యాక్టివేట్ చేయించామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. త్వరలోనే హమాలీల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘హమాలీ బోర్డు’ తీసుకొస్తామని, ఇండ్లలో పనిచేసే గృహ కార్మికుల సంక్షేమానికి కూడా పథకాలు రూపొందిస్తున్నామని ప్రకటించారు. శనివారం జయభేరి గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన గిగ్ వర్కర్ల సభలో మంత్రి మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక చట్టం, దాని అమలు మార్గదర్శకాలు తీసుకొచ్చామని, క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెహ్రూ జయంతి రోజున రాహుల్ చేతుల మీదుగా ఈ చట్టం అమలుకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.

జొమాటో, స్విగ్గీ కార్మికులకు రక్షణ

జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేకపోవడాన్ని భారత్ జోడో యాత్రలో రాహుల్ స్వయంగా గుర్తించారని, వారికి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని సూచించారని మంత్రి గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ హామీని అమలు చేస్తూ సంక్షేమం, సామాజిక భద్రత, ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలతో నెహ్రూ, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌లో మహిళా రిజర్వేషన్లు, ఐటీ విప్లవానికి పునాదులతో రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేశారని కొనియాడారు. 

నాన్న గుర్తొచ్చిండు

కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన తన తండ్రి కాకా వెంకటస్వామి ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనా ప్రైవేట్ రంగ కార్మికులకు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని, ఇప్పుడు రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల పెన్షన్ గురించి మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్‌‌‌‌‌‌‌‌ను కలిసి చెప్పుకున్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరికిందని సభకు వచ్చిన ఓలా, ఉబెర్ డ్రైవర్లు అన్నారు. ప్రమాదంలో చనిపోతే రైతుల్లాగే రూ.5 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా, ఆరోగ్య బీమా, పింఛన్ భరోసా దక్కడంపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌కు 
కృతజ్ఞతలు తెలిపారు.