- అనారోగ్యంతో సినీనటుడు గిరిబాబు కన్నుమూత
- ఐదు దశాబ్దాలు.. 600కు పైగా సినిమాల్లో యాక్టింగ్
- విలన్ పాత్రల నుంచి కమెడియన్ దాకా ఆల్‌రౌండర్
హైదరాబాద్/ వెలుగు: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి
ప్రకాశం జిల్లా రావినూతల గ్రామానికి చెందిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి. ఊళ్లో ఉన్న టూరింగ్ టాకీస్‌లోనే ఎక్కువ టైమ్ గడపడంతో ఆయన్ను సినిమా పిచ్చోడు అనేవారు. నాటకాలపై ఆసక్తితో సొంతంగా నాటక సమాజాన్ని కూడా నడిపారు. నటుడు కావాలన్న బలమైన కోరికతో మద్రాసు వెళ్లిన గిరిబాబు, అవకాశాల కోసం ఎన్నో కష్టాలుపడ్డారు. 1969లో నటుడు మోహన్ బాబుతో కలిసి చెరో రూ.20 వేసుకుని, నెలకు రూ.40 అద్దె ఉండే చిన్న గదిలో ఉంటూ స్ట్రగుల్ అయ్యారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.
‘జగమే మాయ’తో సినీ రంగ ప్రవేశం
హీరో అవ్వాలనే కలతో మద్రాసు వెళ్లిన ఆయన ఎన్నో ప్రయత్నాల తర్వాత 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ విలన్ పాత్రలతోనే ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తనదైన గంభీరమైన సంభాషణలు, విలక్షణమైన హావభావాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణతో అనుబంధం
సూపర్ స్టార్ కృష్ణతో గిరిబాబుకు ప్రత్యేక అనుబంధం ఉంది. కృష్ణతో కలిసి ఆయన ఏకంగా 150కిపైగా సినిమాల్లో నటించారు. కృష్ణ నటించిన ప్రతి సినిమాలో గిరిబాబు ఏదో ఒక పాత్ర పోషించేవారు. వీరిమధ్య ఉన్న అనుబంధానికి మరో ఉదాహరణ 'దొంగోడు వచ్చాడు' సినిమా. 1987లో విడుదలైన ఈ చిత్రంలో గిరిబాబు విలన్‌గా నటించారు. సినిమా విజయం సాధిస్తుందని ముందుగానే అంచనా వేసిన కృష్ణ.. ఈ సినిమా 14 వారాలు ఆడితే, అందులో నాలుగు వారాలు తన వల్ల, మిగిలిన పది వారాలు గిరిబాబు కామెడీ, నటన వల్లే ఆడుతుందని చెప్పారట. ఒక సూపర్ స్టార్ మరో నటుడి టాలెంట్‌ను గొప్పగా గుర్తించడం, స్వయంగా ఆయనే ఫోన్ చేసి అభినందించడం కృష్ణ గొప్ప మనసుకు నిదర్శనమని గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రత్యేక గుర్తింపు
నటనతోనే సరిపెట్టుకోకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. సింహగర్జన, మెరుపుదాడి, ఇంద్రజిత్ వంటి పది చిత్రాలను ఆయన నిర్మించారు. అలాగే రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా వంటి దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు. నటన, నిర్మాణం, దర్శకత్వం.. ఇలా చిత్ర పరిశ్రమలోని పలు విభాగాల్లో తనదైన ముద్ర వేశారు.
తండ్రి బాటలో రఘుబాబు
గిరిబాబు భార్య శ్రీదేవి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు రఘుబాబు, బోసుబాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రఘుబాబు కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. రెండు కుమారుడు బోసు బాబు తండ్రి గిరిబాబు దర్శకత్వం వహించిన 'ఇంద్రజిత్' (1990) సినిమాతో హీరోగా పరిచయమై.. తర్వాత నిమజ్జనం, చెమ్మచెక్క, స్టంట్ మ్యాన్ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఆయన నటనకు స్వస్తి పలికారు. ఐదు దశాబ్దాల పాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన గిరిబాబు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన భౌతికంగా దూరమైనా వెండితెరపై పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఐదు దశాబ్దాలు.. 600 సినిమాలు
ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించారాయన. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు నుంచి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌లతోపాటు నేటి యంగ్ హీరోల వరకు మూడు తరాల స్టార్లతో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లీడ్‌గా, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో మెప్పించారు. అన్నదమ్ముల అనుబంధం, కరుణామయుడు, కాళి, పసివాడి ప్రాణం, హలో బ్రదర్, సిసింద్రీ, అతడు, భైరవ ద్వీపం, నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి, ఖడ్గం, గమ్యం, గీత గోవిందం తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. చివరిగా ఆయన నటించిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. నందినీ రెడ్డి రూపొందించిన ఈ సినిమా 2023లో విడుదలైంది. తరాలు మారినా తన నటనతో కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఆయన చేరువయ్యారు.
