- 600వ ధనికుడి నుంచి రెండో స్థానానికి అదానీ
- ఎయిర్‌పోర్టులు, పోర్టులు అన్నీ ఆయనకే దక్కాయి
- పదేండ్లలో 11 రెట్లు పెరిగిన బీజేపీ ఆస్తులు
- మీడియా సహా వ్యవస్థలన్నీ మోదీ గుప్పిట్లోనే
- 2014లోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది
- ఫాసిస్టులు కాలగర్భంలో కలువడం పక్కా
- మోదీ, షా నియంతృత్వానికి అంతం ఖాయం
- నాపై 45 కేసులు పెట్టిన్రు.. అయినా భయపడ
- సత్యం, అహింసతోనే మోదీని గద్దె దించుతం
- భారత్ సమిట్ ముగింపు సభలో రాహుల్ గాంధీ
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కలిసి దేశాన్ని చెరబట్టారని, మీడియా సహా వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని
ప్రతిపక్షాలను తొక్కిపెడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వీరిద్దరి కలయికతో రాజకీయాలకు, వ్యాపారానికి మధ్య ఉండాల్సిన లక్ష్మణరేఖ పూర్తిగా చెరిగిపోయిందన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, వంతెనలు, సిమెంట్, రక్షణ రంగం, మౌలిక వసతుల ప్రాజెక్టులు.. ఏ రంగం చూసినా అదానీ ఆస్తులే కనిపిస్తున్నాయని విమర్శించారు. పదేండ్లలో బీజేపీ అధికారిక ఆస్తులు 11 రెట్లు పెరిగి ఆ పార్టీ ‘అపరిమిత ఆర్థిక రాక్షసి’గా మారిందని, దేశంలో మరే పార్టీ పోటీ పడలేని అసమాన స్థితిని సృష్టించారని ధ్వజమెత్తారు.
శనివారం హెచ్ఐసీసీలో భారత్ సమిట్ రెండో ఎడిషన్ ముగింపు సభలో రాహుల్ మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ మౌలిక వసతులు సృష్టించి దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆర్థిక నమూనా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిందని అన్నారు. ఆ సమయంలో అమెరికా, పశ్చిమ దేశాల్లో భారీగా నోట్లు ముద్రించి మార్కెట్లలోకి వదిలిన లిక్విడిటీ భారత రాజకీయ వ్యవస్థను దెబ్బతీసిందని, ఈ పరిస్థితుల్లోనే బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రపంచంలో 600వ ధనవంతుడిగా ఉన్న అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా ఎదిగారని విమర్శించారు.
ప్రజలతో పేగుబంధాన్ని తెంచలేరు
రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ పాలకులు గుప్పిట్లోకి తీసుకున్నా, ప్రజలతో తమకున్న పేగుబంధాన్ని తెంచలేరని రాహుల్ అన్నారు. కక్షసాధింపులో భాగంగా తనపై దేశవ్యాప్తంగా 45 క్రిమినల్ కేసులు పెట్టారని, అయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్వేషాన్ని విద్వేషంతో జయించలేమని, సత్యం, అహింస, ప్రేమ అనే ఆయుధాలతోనే మోదీని గద్దె దించుతామని ప్రకటించారు. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థలను నియంత్రిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పాలకులకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెబుతామన్నారు. ఫాసిస్టులు ఎన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నా, ఎంత ధనబలం ప్రదర్శించినా ప్రజలతో నేరుగా ఏర్పరచుకునే అనుబంధమే అన్నింటికంటే శక్తిమంతమైనదని, సత్యం, కరుణ ఆధారంగా నడిచే రాజకీయాలే శాశ్వతమని చెప్పారు.
ఫాసిస్టులు కాలగర్భంలో కలుస్తరు
ప్రపంచం ఇప్పుడు స్పష్టంగా రెండు వర్గాలుగా చీలిపోయిందని రాహుల్ అన్నారు. తమకే అన్నీ తెలుసని, అన్ని సమస్యలకూ తామే పరిష్కారమని, తామే దేవుళ్లమని విర్రవీగే కొద్దిమంది ఒక వర్గమని, వ్యాపారాలు, విద్యాసంస్థలు, అధికార పీఠాల్లో తిష్టవేసిన వీళ్లనే రాజకీయాల్లో ‘ఫాసిస్టులు’ అంటారని చెప్పారు. ఫాసిస్టులు ఎవరి మాటా వినరని, అరుపులు, కేకలతోనే సమాజాన్ని శాసించాలని చూస్తారని మండిపడ్డారు. ప్రపంచంలో మెజారిటీగా ఉన్న రెండో వర్గం ప్రజలు జ్ఞానం పట్ల ఆసక్తితో ప్రశ్నిస్తూ, ఇతరుల బాధలు వింటూ, తప్పులు సరిదిద్దుకునే వినమ్రతతో ఉంటారన్నారు.
సాధారణ పరిస్థితుల్లో దాక్కునే ఫాసిస్టులు వ్యవస్థలు కుప్పకూలినప్పుడే బయటికొచ్చి కాసేపు సమాజాన్ని పీడిస్తారని, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోతారని చెప్పారు. దశాబ్దంగా ప్రపంచంలోనూ, భారత్‌లోనూ ఈ రెండు మనస్తత్వాల మధ్యే అసలు పోరాటం సాగుతోందన్నారు.
మోదీ, షా నియంతృత్వానికి అంతం
మోదీ, అమిత్ షాల నియంతృత్వ పాలన అంతం ఖాయమని, వాళ్ల ఓటమి ఇప్పటికే ఖరారైందని, ఢిల్లీలో పాలకుల ముఖాల్లో కనిపిస్తున్న భయమే అందుకు సంకేతమని అన్నారు. టర్కీ వంటి దేశాల్లో ఇదే తరహా ఆర్థిక గుత్తాధిపత్యం, ఫాసిజం, విద్వేషాన్ని ఎదుర్కొంటూ సమిట్ కు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులను సోదర, సోదరీమణులుగా భావిస్తూ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. ‘సమిట్‌కు రావాల్సిన పలువురు ప్రతినిధులను కేంద్రం అడ్డంకులు సృష్టించి ఆపింది. అది మా తప్పు కాదు. కానీ ఇప్పుడు భారత్‌లో మనం ఎలాంటి నిరంకుశ పాలకులతో పోరాడుతున్నామో అర్థం చేసుకోవడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం’ అని మండిపడ్డారు.
2014లోనే ప్రజాస్వామ్యం ఖూనీ
2014 సార్వత్రిక ఎన్నికలతోనే దేశంలో అసలైన ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాహుల్ ఆరోపించారు. మునుపెన్నడూ చూడని రీతిలో మిలియన్ల డాలర్లను ఎన్నికల వ్యవస్థలోకి కుమ్మరించి, కొత్త తరహా ప్రచారంతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని విమర్శించారు. హోరాహోరీ పోటీలు, సంకీర్ణ ప్రభుత్వాల నమూనాలో నడిచిన ఎన్నికల ప్రక్రియను ఒక్కసారిగా తలకిందులు చేయడంతో ప్రతిపక్షాలన్నీ దశాబ్దం పాటు కోలుకోలేని షాక్‌కు గురయ్యాయని, తమ సిద్ధాంతాలు, కార్యాచరణపై పదేపదే ఆత్మపరిశీలన చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. లోతుగా పరిశీలించాక 2014లోనే భారత ప్రజాస్వామ్య నిర్మాణం నేలమట్టమైందన్న చేదు నిజాన్ని కనిపెట్టామని, దేశంలో అసలైన ప్రజాస్వామ్యమే లేదని ఆధారాలతో నిరూపించామని తెలిపారు. 150 కోట్ల జనాభా ఉన్న భారత ప్రజాస్వామ్యం యావత్ ప్రపంచానికే ఒక ప్రజా సంపద అని, అలాంటి దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం ప్రపంచానికే తీరని నష్టమని అన్నారు.
14 కోట్ల ఓట్లు అక్రమమైతే ఎట్ల చెల్లుతయ్?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసిన దాదాపు 14 కోట్ల మంది ఓటర్లు కారని, అక్రమ ఓటర్లని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిందని రాహుల్ గుర్తుచేశారు. మొత్తం ఓటర్లలో దాదాపు 13 శాతం ఓట్లు అక్రమమని ఈసీయే చెబితే, ఆ ఎన్నికల ఫలితాలు ఎలా చట్టబద్ధమవుతాయని నిలదీశారు. మహారాష్ట్ర ఫలితాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ తమ కూటమి గెలిస్తే, మూడు నెలల్లోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు తుడిచిపెట్టుకుపోయినట్లు చూపించారని ఆరోపించారు. రెండు ఎన్నికల్లోనూ విపక్షాలకు ఒకే రకమైన ఓట్లు వచ్చినా, మూడు నెలల్లో అద్భుతం జరిగినట్లు 70 లక్షల కొత్త ఓట్లు చేరి, అవన్నీ బీజేపీకే పడి ఆ పార్టీని గెలిపించాయని వివరించారు.
మీడియా అడ్డుగోడలు బద్దలుకొట్టినం
ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ మోదీకి, ఆయన పార్టీకి మాత్రమే ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో 24 గంటలూ ప్రచారం కల్పించారని రాహుల్ అన్నారు. ప్రెస్మీట్లు, సభలు కూడా పనిచేయని దుస్థితిలో, తనపై 45 కేసులు, విపక్ష నేతలపై వందలాది కేసులు పెట్టి వేధిస్తున్న తరుణంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో పాదయాత్ర చేపట్టామని గుర్తుచేశారు. ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లడంతో మీడియా అడ్డుగోడలన్నీ బద్దలై అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఈ యాత్రతో భారత ప్రాచీన సంస్కృతిలోని సత్యం, అహింస అనే అసలైన ఆయుధాలను పునరావిష్కరించామని, ఎవరికీ అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదన్న గాంధీజీ మార్గమే అత్యున్నతమైనదని చెప్పారు.
