- రూ.5 లక్షల ప్రమాద బీమా.. రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్
- ప్రతి ఆర్డర్‌పై సంక్షేమ బోర్డుకు 1 శాతం
- ప్రతి సిటీలో ఉచిత వైఫైతో రెస్ట్ జోన్లు
- బీజేపీది కార్పొరేట్ పక్షం.. మాది కార్మికుల పక్షం
- గిగ్ వర్కర్లతో రాహుల్, సీఎం బైక్ ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్లకు గతంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి లావాదేవీలపై పూర్తి హక్కులు కల్పించామని చెప్పారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. బీమా కల్పిస్తుంది. లావాదేవీల్లో వాటా ఇస్తుంది. విశ్రాంతి కేంద్రాలు నిర్మిస్తుంది. ఎవరూ అధైర్యపడొద్దు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు. కార్మికుల పిల్లల చదువు, కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన ‘గిగ్ వర్కర్స్ గుఫ్తగూ’లో రాహుల్ పాల్గొని గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. గిగ్ వర్కర్స్ చట్టం విధివిధానాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, ప్రజాప్రతినిధులు, అధికారులు, భారీ సంఖ్యలో గిగ్ వర్కర్లు పాల్గొన్నారు.
కార్మికులు వ్యవస్థలో ఈక్వల్ పార్ట్నర్స్
దేశంలో రెండు భిన్నమైన ఆలోచనా విధానాల మధ్య పోరాటం సాగుతోందని రాహుల్ అన్నారు. ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్మికులను బానిసలుగా, నౌకర్లుగా చూడాలనుకుంటున్నాయని విమర్శించారు. రోజంతా పనిచేయించుకుంటూ, ప్రమాదాల్లో గాయపడినా, చనిపోయినా పట్టించుకోకుండా శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. లావాదేవీల లాభాలను అంబానీ, అదానీ వంటి పెట్టుబడిదారులు, ఉబెర్, ఓలా వంటి కంపెనీల యజమానులకు కట్టబెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆలోచన ఉందని.. కార్మికులు, గిగ్ వర్కర్లను దేశానికి పునాదిగా భావిస్తుందని చెప్పారు. వారిని నయా బానిసలుగా కాకుండా వ్యవస్థలో సమాన భాగస్వాములుగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
సంక్షేమ బోర్డుకు కంపెనీల వాటా
కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తుందని రాహుల్ ప్రకటించారు. వృద్ధాప్యంలో పింఛన్ అందేలా సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ఉబెర్ క్యాబ్ రైడ్, బ్లింకిట్, జొమాటో డెలివరీ సహా ప్రతి లావాదేవీపై కంపెనీలు ఒక శాతం ఫీజు చెల్లించేలా చట్టం తెచ్చామని వివరించారు. ఈ మొత్తం నేరుగా గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు చేరుతుందని, అక్కడి నుంచి కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. ఈ నిధి వారి భవిష్యత్తు భద్రతకు, పింఛన్‌కు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మొబైల్లోనే సంపాదన వివరాలు
ప్రస్తుత శతాబ్దం డేటా ఆధారంగా నడుస్తున్నదని, గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ఉబెర్ వంటి సంస్థలు డేటాతో భారీ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నాయని రాహుల్ చెప్పారు. కానీ గిగ్ వర్కర్లు తమ శ్రమతో సృష్టించే డేటాపై వారికే సమాచారం లేకపోవడం దారుణమన్నారు. ఎన్ని గంటలు పనిచేశారు? ఎన్ని డెలివరీలు పూర్తి చేశారు? కంపెనీ ఎంత సంపాదించింది? కార్మికుడికి ఎంత చెల్లించింది? వంటి వివరాలు తెలియకుండా సంస్థలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. కొత్త చట్టంతో కార్మికులకు తమ డేటాపై చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. చేసిన పని, రైడ్లు, డెలివరీలు, వెచ్చించిన సమయం, ప్రతి లావాదేవీ ద్వారా వచ్చిన సంపాదన వివరాలు మొబైల్ ఫోన్లోనే చూసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
విశ్రాంతికి ప్రత్యేక వసతులు
ఎండల్లో రోజంతా రోడ్లపై తిరిగే డెలివరీ కార్మికులకు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతులు లేవని రాహుల్ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఉచిత వైఫైతో ప్రత్యేక రెస్ట్ జోన్లు నిర్మిస్తామని ప్రకటించారు. అక్కడ వాహనాల పార్కింగ్, కూర్చునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు, నిద్రపోయేందుకు, మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేసుకునేందుకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
డెలివరీ విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వల్లూరి సందీప్, అలుగుల శ్యామ్ కుటుంబ సభ్యులకు సభా వేదికపై ఆర్థికసాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కులను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. గిగ్ వర్కర్ల అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
