- ఉ. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
మౌంట్ మాంగనూయి: బ్యాటింగ్ వైఫల్యంతో నాలుగో వన్డే ఘోరంగా ఓడిన ఇండియా.. న్యూజిలాండ్‌తో ఆఖరిదైన ఐదో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ పోరులో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఎలాగైనా గెలిచి సమం చేయాలని కివీస్ ప్రణాళికలు రచిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా 2–1 ఆధిక్యంలో ఉంది. సీమింగ్ పరిస్థితుల్లో టాప్ బ్యాటర్లు విఫలం కావడం పర్యాటక జట్టును ఆందోళనలో పడేసింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఒకే ఓవర్లో డకౌట్ కావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
కాబట్టి పేస్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఇండియా ఆటతీరు గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సౌతాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం పేస్‌కు అనుకూలమైన పిచ్లే ఎదురుకానున్నాయి. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, నమన్ ధీర్ కూడా బ్యాట్లు ఝుళిపించాలి. బౌలింగ్‌లోనూ ఇండియా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. పవర్‌ప్లేలో కివీస్ నాలుగు వికెట్లు తీస్తే, మనోళ్లు కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
గుర్నూర్ బ్రార్, అకిబ్ నబీ రన్స్ ధారాళంగా సమర్పించుకున్నారు. అక్షర్ పటేల్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఫిన్ అలెన్ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. కివీస్ బౌలర్లందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ బౌన్స్, స్వింగ్ బాల్స్‌కు టీమిండియా బ్యాటర్ల వద్ద సమాధానం లేదు.
