ఎల్ నినో ఎఫెక్ట్ తగ్గిన పంటల సాగు.. ఇప్పటి వరకు వేసింది 2 లక్షల ఎకరాల్లోపే 

ఎల్ నినో ఎఫెక్ట్ తగ్గిన పంటల సాగు.. ఇప్పటి వరకు వేసింది 2 లక్షల ఎకరాల్లోపే 
  •  పల్లీ, శనగ పంటల వాటానే లక్షన్నర ఎకరాలు
  • మొదలేకాని వరిసాగు.. 40 వేల ఎకరాల్లో మక్క  
  • సాధారణ సాగు విస్తీర్ణం 73.71లక్షల ఎకరాలు..
  • రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక 

 హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగు ఈసారి ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. ఎల్‌‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, బావుల్లో భూగర్భజలాలు అడుగంటుతుండటంతో రైతులు సాగు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

సాధారణంగా యాసంగి సీజన్‌‌లో వరి సాగుతో కళకళలాడాల్సిన పొలాలు ఈసారి ఇంకా బీడుగానే కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 2 లక్షల ఎకరాల్లోపే వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వేరుశనగ, పప్పుశనగ పంటల విస్తీర్ణమే లక్షన్నర ఎకరాలకు చేరువలో ఉంది. మరోవైపు, దాదాపు 28 వేల ఎకరాల్లో రైతులు మక్కజొన్న సాగు చేపట్టారు. వరి సాగు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో యాసంగి సీజన్‌‌ ప్రారంభంలోనే సాగు గణనీయంగా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ మేరకు  ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ తాజాగా యాసంగి సాగు వివరాలపై నివేదిక అందించింది.

ఇంకా పొలాల్లోకి దిగని రైతులు 

రాష్ట్రంలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 73.71లక్షల ఎకరాలు. ఈ లెక్కన సీజన్‌‌లో సాగు కావాల్సిన విస్తీర్ణంతో పోలిస్తే ఇప్పటి వరకు నమోదైన సాగు చాలా తక్కువ. యాసంగి ప్రారంభమై కీలక పంటల విత్తనాలు వేసే సమయం వచ్చినప్పటికీ రైతులు ఇంకా పొలాల్లోకి దిగడం లేదు. ముఖ్యంగా వరి సాగుకు అవసరమైన నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడంతో రైతులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నీటి వనరుల పరిస్థితిని బేరీజు వేసుకున్న తర్వాతే పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

గతంతో పోలిస్తే తగ్గిన పప్పుశనగ

ప్రస్తుతం సాగులో ఉన్న పంటల్లో వేరుశనగ, పప్పుశనగ ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 66 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. సాధారణంగా ఈ సమయానికి లక్ష ఎకరాలు దాటాల్సి ఉండగా, ఈసారి అందులో మూడింట రెండొంతుల మేర కూడా సాగు జరగలేదు. పెద్దపల్లి జిల్లాలో 12,682 ఎకరాలు, ఖమ్మంలో 11,828 ఎకరాలు, జగిత్యాలలో 3 వేల ఎకరాలు, కరీంనగర్‌‌లో 2,500 ఎకరాల్లో వేరుశనగ సాగు నమోదైంది. సాగు ఆలస్యమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశనగ పంట కొంత మేర సాగును నిలబెట్టిందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పప్పుశనగ సాగు కూడా గతంతో పోలిస్తే తగ్గింది. సాధారణంగా ఈ సమయానికి దాదాపు 89 వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 44 వేల ఎకరాలకే పరిమితమైంది. ఆదిలాబాద్‌‌లో 9,550 ఎకరాలు, కామారెడ్డిలో 8,156 ఎకరాలు, సంగారెడ్డిలో 7,836 ఎకరాలు, నిర్మల్‌‌లో 4,238 ఎకరాలు, గద్వాలలో 2,708 ఎకరాల్లో పప్పుశనగ సాగైంది. నీటి అవసరం తక్కువగా ఉండే పంటల వైపు కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నప్పటికీ, మొత్తం మీద పప్పుధాన్యాల సాగు కూడా ఆశించిన స్థాయిలో లేదు.

28వేల ఎకరాల్లో మక్కజొన్న..

యాసంగిలో కీలకమైన పంటల్లో ఒకటైన మక్కజొన్న సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నది. ఇప్పటి వరకు సుమారు 28 వేల ఎకరాల్లో రైతులు మక్కజొన్న వేశారు. చెరువులు, కాలువల నీటిపై ఆధారపడే వరి సాగుతో పోలిస్తే మెట్ట ప్రాంతాల్లో మక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో మక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగితేనే యాసంగి సాగు గణాంకాల్లో కొంత పురోగతి కనిపించనుంది. ప్రస్తుతం పల్లీ, శనగ పంటలతోనే సాగు విస్తీర్ణం ఎక్కువగా నమోదవుతుండగా, మక్కజొన్న కూడా తోడైతే సీజన్‌‌ కొంత ఊపందుకునే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా సాగులోనూ వ్యత్యాసం

ప్రస్తుతం నమోదైన సాగు విస్తీర్ణంలో జిల్లాల మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తున్నది. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో అత్యధికంగా 42 వేల ఎకరాల్లో సాగు జరగగా, గద్వాలలో 18,848 ఎకరాలు, వికారాబాద్‌‌లో 12,824 ఎకరాలు, నారాయణపేటలో 11,831 ఎకరాలు నమోదయ్యాయి. నిజామాబాద్‌‌లో 22,929 ఎకరాలు, కామారెడ్డిలో 10,526 ఎకరాలు, ఆదిలాబాద్‌‌లో 10 వేల ఎకరాలు, సంగారెడ్డిలో 10 వేల ఎకరాలు, ఖమ్మంలో 8,534 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే కొన్ని జిల్లాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు ముందుకు సాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో సాగు ప్రారంభమే కాలేదని స్పష్టమవుతున్నది.

 వరి సాగుపై ఇంకా సందిగ్ధమే..

యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి పంటపై మాత్రం రైతులు ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు. చెరువుల్లో నీటి నిల్వలు తగ్గడం, బోర్లు, బావుల్లో భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వరి నాట్లు వేసేందుకు వెనుకాడుతున్నారు. సాధారణ వరి సాగు 54.33 లక్షల ఎకరాలు కాగా ఈసారి ఇప్పటి వరి సాగే జరగలేదు. ఒకసారి వరి నాట్లు ప్రారంభిస్తే పంట చేతికి వచ్చే వరకు నిరంతరంగా నీరు అవసరమవుతుంది. మధ్యలో నీటి కొరత ఏర్పడితే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే వరి సాగు వాయిదా వేసుకోవాలని ప్రకటించిన నేపథ్యంలో ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి మాత్రమే వరి సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే నీటి వనరుల పరిస్థితి అనుకూలించకపోతే ఈ అంచనాలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయన్నది చూడాల్సి ఉంది.

 నీటి లభ్యతపైనే ఆశలు..

యాసంగి సాగు విస్తీర్ణం పెరగాలంటే ప్రధానంగా నీటి వనరుల పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. ప్రస్తుతం రైతులు వర్షాలు, భూగర్భజలాల పరిస్థితిని గమనిస్తూ పంటల ఎంపికపై నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులు తమ ప్రాంతాల్లోని నీటి లభ్యత, పెట్టుబడి వ్యయం, మార్కెట్‌‌ ధరలను దృష్టిలో పెట్టుకుని సాగుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో వరి, మక్కజొన్న సాగు ప్రారంభమైతేనే యాసంగి సీజన్‌‌ అసలు స్వరూపం బయటపడనుంది. అప్పటి వరకు ఎల్‌‌నినో ప్రభావం, నీటి వనరుల పరిస్థితి యాసంగి సాగు పురోగతిని నిర్దేశించనున్నాయి.