- అండర్ 19 ఫైనల్లో ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్‌పై విజయం
- రికార్డు స్థాయిలో తొమ్మిదో టైటిల్
- రాణించిన లక్ష్య, ఆర్యవీర్, మోహిత్
అల్ అమెరాత్: అండర్–19 ఆసియా కప్‌లో ఇండియా కుర్రాళ్లు సంచలనం సృష్టించారు. పాకిస్తాన్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 252/8 స్కోరుతో కష్టాల్లో పడినా.. చివరి బాల్‌కు అద్భుతం చేశారు. ఆఖరి ఓవర్లో 8 రన్స్ కావాల్సిన దశలో ఐదు బాల్స్‌కు వైడ్‌తో కలిపి 5 రన్స్ రాబట్టారు. ఇక విజయానికి మూడు పరుగులు అవసరమైన దశలో మోహిత్ ఉల్వా (26 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్) చివరి బాల్‌ను ఫోర్‌గా మలిచాడు. ఫలితంగా శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఇండియా ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. దాంతో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి పాక్ 50 ఓవర్లలో 337/9 స్కోరు చేసింది. ఉస్మాన్ ఖాన్ (107) సెంచరీ సాధించాడు. తర్వాత ఇండియా 50 ఓవర్లలో 339/7 స్కోరు చేసి నెగ్గింది. లక్ష్య రాయ్ చందానీ (80), ఆర్యవీర్ సెహ్వాగ్ (58) చెలరేగారు. మోహిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఆర్యవీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
బౌలర్లు ఫెయిల్..
ముందుగా పాక్‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్ కాలేదు. ఉస్మాన్ ఖాన్.. హయుమ్ ఖాన్ (21)తో 8.1 ఓవర్లలోనే 62 రన్స్ జోడించాడు. ఆ తర్వాత జోరు పెంచిన ఉస్మాన్ 106 బాల్స్‌లో సెంచరీని పూర్తి చేశాడు. అబ్దుల్ ఖదీర్ (80) కూడా బ్యాట్ ఝుళిపించడంతో రన్స్ వేగంగా వచ్చాయి. లెఫ్టార్మ్ స్పిన్నర్ మనల్, యశ్వర్ధన్ చౌహాన్ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డ ఖదీర్ 39 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఉస్మాన్‌తో కలిసి కేవలం 18 ఓవర్లలోనే 135 రన్స్ జత చేశాడు. చివరకు అర్జున్ రాజ్‌పుత్ బౌలింగ్‌లో షాట్ కొట్టి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ఫర్హాన్ యూసఫ్ (63) కూడా ఇండియా బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టాడు. మూడో వికెట్‌కు 43 రన్స్ జత చేసిన తర్వాత పేసర్ కావ్య పటేల్ (4/68) బౌలింగ్‌లో ఉస్మాన్ వెనుదిరిగాడు. దాంతో పాక్ స్కోరు 36 ఓవర్లలో 240/3గా మారింది. ఇక్కడి నుంచి ఫర్హాన్ నిలకడగా ఆడాడు. రెండో ఎండ్‌లో అహ్మద్ హుస్సేన్ (17), హమ్జా (10), అబ్బాస్ డార్ (2), మహ్మద్ సయ్యామ్ (7), నికాబ్ షషిక్ (11) విఫలమయ్యారు. చిగురుపాటి వెంకట 3 వికెట్లు తీశాడు.
ఆఖరి బాల్‌కు ఫోర్.
భారీ ఛేదనలో లక్ష్య, ఆర్యవీర్ తొలి వికెట్‌కు 95 రన్స్ జత చేశారు. అయితే 18వ ఓవర్లో ఆర్యవీర్ ఔట్‌తో ఇండియా ఇన్నింగ్స్ తడబడింది. రిజ్వానుల్లా (3/53), నికాబ్ షఫిక్ (2/57) నిలకడగా బౌలింగ్ చేయడంతో మిడిలార్డర్ రన్స్ చేయడంలో ఇబ్బందిపడింది. వీకే వినీత్ (24), అర్జున్ రాజ్‌పుత్ (16), యశ్వర్ధన్ చౌహాన్ (9), అన్వయ్ ద్రవిడ్ (19) నిరాశపర్చారు. మధ్యలో లక్ష్య కూడా వెనుదిరగడంతో ఇండియా 217/6 స్కోరుతో కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి మానల్ చౌహాన్ (47) ఒంటరి పోరాటం చేశాడు. కానీ అవతలి వైపు ఆర్యన్ (9), కావ్య పటేల్ (0) వరుస విరామాల్లో ఔట్ కావడంతో ఇండియా 252/8తో ఓటమి దిశగా పయనించింది. ఈ టైమ్‌లో మానల్కు తోడైన మోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొమ్మిదో వికెట్‌కు 57 రన్స్‌తో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇక ఫర్వాలేదనుకున్న టైమ్‌లో షఫిక్ దెబ్బకు మానల్ ఔట్ కావడంతో స్కోరు 309/9గా మారింది. ఇండియా విజయానికి 36 రన్స్ అవసరం కాగా చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. విజయం అసాధ్యమే అనుకున్న టైమ్‌లో చిగురుపాటి వెంకట (11 నాటౌట్) అండగా నిలిచాడు. ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్న మోహిత్ చకచకా రన్స్ రాబట్టాడు. ఫలితంగా 49వ ఓవర్లో 17 రన్స్ రావడం ఇండియా స్కోరు 330/9కు చేరింది. చివరి ఆరు బాల్స్‌కు 8 రన్స్ కావాల్సిన దశలో మోహిత్ లాంగాఫ్ దిశగా ఫోర్ కొట్టి అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్: 50 ఓవర్లలో 337/9 (ఉస్మాన్ ఖాన్ 107, అబ్దుల్ ఖదీర్ 80, కావ్య పటేల్ 4/68). ఇండియా: 50 ఓవర్లలో 339/7 (లక్ష్య 80, ఆర్యవీర్ 58, మోహిత్ 49*, రిజ్వానుల్లా 3/53).
