- ఎయిర్‌పోర్టుల్లోనే 15 లక్షల మంది పడిగాపులు
- 4 గంటల తర్వాత ఆంక్షలను ఎత్తివేసిన ఎఫ్‌ఏఏ
- ఓల్డ్ సిస్టమ్, డేటా ఓవర్‌లోడ్ వల్లే గందరగోళం..
- అమెరికా రవాణా మంత్రి సీన్ డఫీ వివరణ
- ఇది సైబర్ దాడి, మరో 9/11 అసలే కాదని వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్(ఏటీసీ) వ్యవస్థలో తలెత్తిన టెక్నికల్ లోపంతో సుమారు 8 వేలకు పైగా విమానాలు ఎయిర్ పోర్టుల్లోనే నిలిచిపోయాయి. అంతేగాక, వేలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో 15 లక్షల మందికి పైగా ప్యాసింజర్లు తమ ఫ్లైట్ల కోసం సుమారు 4 గంటల పాటు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాశారు. 2001లో జరిగిన 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికాలో ఇలా దేశవ్యాప్తంగా విమానాలను ఆపేయడం ఇది రెండోసారి.
అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3:54 గంటల(భారత్‌లో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల)కు దేశవ్యాప్తంగా బయలుదేరే అన్ని విమానాలకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) 'గ్రౌండ్ స్టాప్(విమానాల నిలిపివేత)' ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కొత్తగా లేదా షెడ్యూల్ ప్రకారం బయలుదేరాల్సిన అన్ని విమానాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, అప్పటికే గాల్లో ఉన్న విమానాలు మాత్రం తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి అధికారులు అనుమతించారు. ఎలాంటి ఉగ్రదాడి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత రాత్రి 8:15 గంటలకు గ్రౌండ్ స్టాప్ ఆంక్షలు ఎత్తివేశారు.
ఓల్డ్ సిస్టమ్, డేటా ఓవర్ లోడ్ వల్లే..
టెలికమ్యూనికేషన్స్ వైఫల్యం వల్లే విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తెలిపారు. దీనివల్ల కంట్రోల్ రూమ్‌కు గాల్లో, నేలపై ఉన్న విమానాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. కంట్రోలర్లు పైలట్లతో మాట్లాడటానికి, మార్గాలను పర్యవేక్షించడానికి వీలులేకుండా పోయిందన్నారు. 1980ల నాటి ఓల్డ్ సిస్టమ్, డేటా ఓవర్ లోడ్ వల్లే ఈ లెగసీ సిస్టమ్ క్రాష్ అయిందని తెలిపారు. విమానాలు సురక్షితంగా ప్రయాణించాలంటే ఏ సమయానికి, ఏ విమానం ఎక్కడ ఉందో కచ్చితమైన సమాచారం అవసరమని చెప్పారు.
కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలమైతే ఏ విమానం ఎటు వెళ్తుందో తెలియక విమానాలు ఢీకొంటాయన్నారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికే ఏఫ్ఏఏ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ (గ్రౌండ్ స్టాప్) అత్యవసర ఆదేశాలు జారీ చేశామన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాలను ఆపాల్సి వచ్చిందని.. ఎలాంటి సైబర్ దాడి లేదని, మైక్రోసాఫ్ట్ ఔటేజ్‌తో దీనికి సంబంధంలేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ తేల్చి చెప్పారు. ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిషేధం ఎత్తివేసినప్పటికీ.. విమానాలు, సిబ్బందిని తిరిగి సర్దుబాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. మరో రెండు వారాల్లో సర్వీసులు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
