భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర అనగానే మనకు అనేకమంది జాతీయ నాయకులు, విప్లవ వీరులు గుర్తుకొస్తారు. అయితే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీ వీరుల చరిత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన గిరిజన నాయకుల్లో భగవాన్ బిర్సా ముండా ప్రముఖుడు. ఆదివాసీల భూమి, అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
కేవలం 25 సంవత్సరాల జీవితకాలంలోనే ఒక సామాజిక విప్లవానికి నాంది పలికి, గిరిజన సమాజంలో చైతన్య జ్వాలను రగిలించిన మహనీయుడు బిర్సా ముండా.1875 నవంబర్ 15న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాకు చెందిన ఉలిహాతు గ్రామంలో బిర్సా ముండా జన్మించాడు. తండ్రి సుగ్నా ముండా, తల్లి కర్మీ హాతు. సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే పేదరికం, సామాజిక అసమానతలు, గిరిజనులపై జరుగుతున్న దోపిడీని దగ్గరగా చూశారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాటం
ఆ కాలంలో ఛోటానాగ్పూర్ ప్రాంతంలో బ్రిటిష్ పాలకుల విధానాలు గిరిజనుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సంప్రదాయంగా సాగుచేసుకుంటున్న భూములపై గిరిజనులకు ఉన్న హక్కులు క్రమంగా దూరమయ్యాయి. జమీందారులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారులు గిరిజనులను ఆర్థికంగా దోపిడీచేశారు. పోడు వ్యవసాయం, పశువుల మేత, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి సంప్రదాయ జీవనాధారాలపై ఆంక్షలు విధించడం జరిగింది.
ఈ పరిస్థితుల్లో గిరిజనుల సమస్యలను అర్థం చేసుకున్న బిర్సా ముండా వారి హక్కుల కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. గిరిజన సమాజంలో సామాజిక సంస్కరణలు రావాలని, మూఢనమ్మకాలు, మద్యపానం, సామాజిక దురాచారాలు తగ్గాలని ఆకాంక్షించారు. గిరిజనుల సంప్రదాయ సంస్కృతిని కాపాడుకుంటూనే సమాజంలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. ఆయన బోధనలు గిరిజన ప్రజల్లో విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ప్రజలు ఆయనను ఆధ్యాత్మిక నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా, తమ హక్కుల కోసం పోరాడే నాయకుడిగా భావించారు అందుకే ఆయనను భగవాన్ బిర్సా ముండాగా గౌరవించారు.
జన్ జాతీయ గౌరవ్ దివస్‌గా..
బిర్సా ముండా నాయకత్వంలో ప్రారంభమైన ఉల్గులాన్ ఉద్యమం 1899లో తీవ్రరూపం దాల్చింది. ‘అబువా రాజ్ ఏతే జానా, మహారాణి రాజ్ తుండు జానా’ అంటే మన రాజ్యం రావాలి, రాణి పాలన అంతం కావాలి. ఈ నినాదంతో గిరిజనుల్లో స్వయంపాలన పట్ల ఆకాంక్షను పెంపొందించారు. బిర్సా ముండాను 1900 మార్చి 3న జంకోపై అడవిలో బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. 1900 జూన్ 9న రాంచీ జైలులో అనారోగ్యంతో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆయన పోరాటం బ్రిటిష్ పాలకులపై ఒత్తిడి పెంచి గిరిజన భూమి హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టపరమైన మార్పులకు దోహదపడింది.
ముఖ్యంగా 1908లో అమలులోకి వచ్చిన ఛోటా నాగ్‌పూర్ టెనెన్సీ చట్టం గిరిజన భూములను గిరిజనేతరులకు బదిలీ చేయడంపై పరిమితులు విధించింది. బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని గుర్తించిన భారత ప్రభుత్వం 2021 నుంచి ప్రతి ఏటా నవంబర్ 15ను జన్ జాతీయ గౌరవ్ దివస్‌గా నిర్వహిస్తోంది. ఆయన 150వ జయంతి సందర్భంగా 2024–25 సంవత్సరాన్ని జన్ జాతీయ గౌరవ్ వర్ష్‌గా పాటించింది. గిరిజనుల అభివృద్ధి కోసం పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది.
2026లో నవంబర్ 1 నుంచి 15 వరకు జన్‌జాతీయ గౌరవ్ పఖ్వాడా నిర్వహిస్తూ గిరిజన ప్రాంతాలకు సంక్షేమ పథకాలను చేరువ చేయడంపై దృష్టి సారించింది. బిర్సా ముండా జీవితం, ఆయన పోరాట స్ఫూర్తి భారతదేశంలో సామాజిక న్యాయం, గిరిజన సాధికారత సాధించే దిశగా ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది.
- డా.చింత ఎల్లస్వామి,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
