- చదువుకు, జాబ్స్‌కు మధ్య గ్యాప్ పూడ్చడంపై సర్కారు ఫోకస్
- భారత్ సమిట్ ప్యానెల్ చర్చలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
హైదరాబాద్, వెలుగు: చదువు అంటే కేవలం డిగ్రీ సర్టిఫికెట్ మాత్రమే కాదని.. ఉద్యోగం తెచ్చిపెట్టే స్కిల్, కొత్తది కనిపెట్టే ధైర్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా నిర్వహించిన రెండో ఎడిషన్ ‘భారత్ సమిట్ (ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్)’ లో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ రైజింగ్– యూత్ అండ్ స్పోర్ట్స్’ అంశంపై ప్యానెల్ చర్చలో యువత, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఆ లెక్కన 12 ఏండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉండేదన్నారు. పెద్ద నంబర్లు చెప్పడం కాదని, యువతకు నిజంగా ఉద్యోగాలు ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా చదువుకు, ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చడంపై దృష్టిపెట్టిందన్నారు. సీఎం రేవంత్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో టాటా సంస్థతో కలిసి రాష్ట్రంలో ఏటీసీలను ఏర్పాటు చేశామన్నారు.
టామ్‌కామ్ ద్వారా జర్మనీ, జపాన్‌లకు..
విదేశీ ఉపాధి అవకాశాలపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎంపీ వంశీకృష్ణ చెప్పారు. టామ్‌కామ్ ద్వారా యువతను జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. యువతను కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా.. పది మందికి ఉపాధి కల్పించే ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాకా గ్రోత్ ఫండ్ (కేజీఎఫ్) ద్వారా జిల్లా స్థాయిలోనే యువత ఆలోచనలకు అనుగుణంగా సీడ్ ఫండింగ్ ఇస్తున్నామని తెలిపారు.
