డబ్బులు పోగొట్టుకోవడం అంటే ఎవరికైనా బాధే. అందులోనూ కష్టపడి సంపాదించిన డబ్బు కళ్లముందే చేజారిపోతుంటే ఆ బాధ వర్ణించలేం. అలాంటిది ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బులు వేయడానికి వెళ్తుండగా, ఊహించని విధంగా ఓ కోతి అతడి జేబులోని డబుల కవరుని ఎత్తుకెళ్లింది. అంతటితో ఆగకుండా చెట్టెక్కి, ఒక్కొక్కటిగా నోట్లను కిందకు పడేయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. డబ్బులు కోసం పరుగులు పెట్టారు. ఈ వింత ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చోటుచేసుకుంది.
బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వెళ్తుండగా
సిమ్లాలోని డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న రూ.81,800 డబ్బును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తున్నాడు. డబ్బులను ఒక కవరును తన జేబులో ఉంచుకున్నాడు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో అనుకోని ఘటన ఎదురైంది.
అక్కడే తిరుగుతున్న ఓ కోతి ఒక్కసారిగా అతడి దగ్గరకు వచ్చి జేబులో ఉన్న డబ్బుల కవరును లాక్కుంది. ఆ తర్వాత క్షణాల్లోనే అక్కడి నుంచి పరుగెత్తి ఓ చెట్టుపైకి ఎక్కేసింది. తన కళ్లముందే డబ్బులు కోతి చేతికి చిక్కడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
చెట్టుపై కూర్చొని నోట్లను కిందకు విసిరిన కోతి!
సాధారణంగా కోతులు ఆహారం, పండ్లు లేదా తినుబండారాలను లాక్కెళ్లడం మనం చూస్తుంటాం. కానీ ఈ కోతి మాత్రం ఏకంగా డబ్బుల కవరునే ఎత్తుకెళ్లింది.
చెట్టుపైకి వెళ్లిన తర్వాత ఆ కవరును తెరిచి అందులో ఉన్న నోట్లను బయటకు పడేయడం మొదలుపెట్టింది. ఒక్కో నోటును కిందకు పడేస్తూ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. కొద్దిసేపటికే చెట్టు కింద రూ.500, ఇతర నోట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. తన డబ్బులు అలా కింద పడుతుండటాన్ని చూసిన ఆ వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎలాగైనా తన డబ్బులు తిరిగి తెచుకోవాలని ప్రయత్నించాడు.
డబ్బులు కోసం పరుగులు పెట్టిన జనం..
కోతి డబ్బులు కిందకు పడేస్తున్న విషయం గమనించిన డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో ఉద్యోగులు, అక్కడికి వచ్చిన ప్రజలు వెంటనే స్పందించారు. చెట్టుకిందకు వెళ్లి కింద పడిన నోట్లను ఒక్కొక్కటిగా ఏరడం స్టార్ట్ చేసారు. కొందరు కోతి విసిరిన నోట్లు ఎక్కడ పడుతున్నాయో గమనిస్తూ వాటిని సేకరించారు.
అలా అక్కడున్న వారంతా కలిసి బాధితుడికి సహాయం చేయడంతో చాలా వరకు డబ్బు తిరిగి దొరికింది. అయితే మొత్తం రూ.81,800లో ఇంకా సుమారు రూ.1,500 దొరకలేదని బాధితుడు తెలిపాడు. ఇక ఆ కోతి కొన్ని రూ.500 నోట్లను చించేసింది. చేతిలో ఉండాల్సిన డబ్బులు క్షణాల్లో కోతి చేతికి చిక్కడం, తిరిగి వాటిని తెచుకోవడనికి ఇంతమంది శ్రమించాల్సి రావడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
బులంద్‌షహర్‌లోనూ ఇలాంటి ఘటనే..
సిమ్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా, గతంలో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. 2026 మే నెలలో బులంద్‌షహర్‌లోని కోర్టు ప్రాంగణంలో ఓ కోతి ఏకంగా రూ.2 లక్షల ఉన్న సంచిని ఎత్తుకెళ్లింది.
ఆస్తి రిజిస్ట్రేషన్ పనుల కోసం రవీంద్ర లోధి అలియాస్ రాజు అనే వ్యక్తి కోర్టుకు వచ్చాడు. ఆస్తి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన స్టాంప్ పేపర్లు కొనుగోలు చేయాల్సి ఉండటంతో రూ.2 లక్షల నగదు ఉన్న సంచిని తనతో తీసుకొచ్చాడు. అతడు స్టాంప్ విక్రయించే వ్యక్తి దగ్గరకు వెళ్తుండగా, ఒక్కసారిగా ఓ కోతి అతడి చేతిలోని డబ్బుల సంచిని లాక్కొని అక్కడ ఉన్న చెట్టుపైకి ఎక్కింది.
రూ.500 నోట్లను కిందకు విసిరేయడంతో
చెట్టుపైకి వెళ్లిన కోతి ఆ సంచిని చింపేసి అందులోని నోట్లను బయటకు విసరడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో రూ.500 నోట్లు ఒక్కొక్కటిగా చెట్టు మీద నుంచి కిందకు పడటం ప్రారంభించాయి. దీన్ని చూసి అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే చెట్టు కిందకు చేరుకుని పడిన నోట్లను ఏరడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. డబ్బులు చెల్లాచెదురుగా పడిపోవడంతో వాటిని జాగ్రత్తగా సేకరించే పనిలో పడ్డారు. చివరకు మొత్తం రూ.2 లక్షల్లో రూ.1.98 లక్షలను తిరిగి స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు.
కోతుల బెడదతో ప్రజలకు కొత్త తలనొప్పి!
సిమ్లా, బులంద్‌షహర్ ఘటనలను చూస్తుంటే కోతుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరోసారి స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు, కోర్టులు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కోతులు అకస్మాత్తుగా వచ్చి చేతుల్లోని వస్తువులు, ఆహార పదార్థాలు, బ్యాగులు లాక్కెళ్లడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది.
చిన్న వస్తువులే అనుకుంటే పొరపాటే.. ఏకంగా లక్షల రూపాయల డబ్బులు కూడా వాటి చేతికి చిక్కుతోంది. కష్టపడి సంపాదించిన డబ్బును క్షణాల్లో పోగొట్టుకునే పరిస్థితి వస్తోంది. అయితే ఈ రెండు ఘటనల్లోనూ బాధితులకు అక్కడున్న ప్రజలు, అధికారులు సహాయం చేయడం కొంత ఊరటనిచ్చే విషయం. ముఖ్యంగా సిమ్లాలో డబ్బులు తిరిగి దొరకడానికి అక్కడి ప్రజలు చూపించిన చొరవ అభినందనీయం.
ఒక్క కోతి చేసిన పనికి వందల మంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. డబ్బులు కాపాడుకోవడానికి ఇంత హడావుడి చేయాల్సి వస్తుందని ఏ వ్యక్తి కూడా కలలో ఊహించి ఉండడు కదా!
Gazab bandar hain 😂 monkey snatched a packet containing ₹81,000 from a person near Shimla DC Office and scattered the cash everywhere. Thankfully, locals stepped in and helped recover the money. https://t.co/VBOWVA52Nn
— Nikhil saini (@iNikhilsaini) November 12, 2026
