Ramayana Collections: బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న రామాయణం.. పది రోజుల్లో కలెక్షన్ల ప్రభంజనం!

Ramayana Collections: బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న రామాయణం.. పది రోజుల్లో కలెక్షన్ల ప్రభంజనం!

బాక్సాఫీస్ దగ్గర రామాయణం ప్రభంజనం కొనసాగుతోంది. తొలి వారం రికార్డుల వేటతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మైథలాజికల్ ఎపిక్.. రెండో వారాంతంలోనూ అదే జోరు చూపిస్తోంది. ముఖ్యంగా రెండో శనివారం కలెక్షన్లలో భారీ జంప్ నమోదు చేయడంతో 'రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' మరో అరుదైన మైలురాయిని అందుకుంది. కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.1,200 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ రన్‌పై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.

రెండో శనివారం అదిరిపోయే కమ్‌బ్యాక్!

నవంబర్ 5న విడుదలైన 'రామాయణం' తొలి రోజు నుంచే వసూళ్లలో దూకుడు చూపిస్తోంది. మొదటి వారంలో ఇండియాలో రూ.564.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో వారం శుక్రవారం రూ.48.10 కోట్లకు పరిమితమైంది. అయితే రెండో శనివారం మాత్రం అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఒక్కరోజే రూ.72.90 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, శుక్రవారంతో పోలిస్తే ఏకంగా 51.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. 23,451 షోల ద్వారా ఈ వసూళ్లు రాబట్టింది. దీంతో పది రోజుల ఇండియా నెట్ కలెక్షన్లు రూ.685.60 కోట్లకు, ఇండియా గ్రాస్ రూ.819.50 కోట్లకు చేరాయి. ఇలా కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.1,200 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో రెండో వీకెండ్‌లోనూ జోరు పెంచిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఓవర్సీస్‌లోనూ రామాయణం ర్యాంపేజ్!

దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ 'రామాయణం' భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు విదేశాల్లో రూ.408.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పదో రోజు ఒక్కరోజే అక్కడ సుమారు రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.819.50 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.408.50 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1,228 కోట్ల గ్రాస్‌ను సాధించింది. వరల్డ్‌వైడ్ వసూళ్లలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 33.3 శాతంగా ఉండటం విశేషం.

వెయ్యి కోట్ల క్లబ్‌లో మూడో ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిల్మ్!

కలెక్షన్ల వేగంలోనూ 'రామాయణం' సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల వసూళ్ల మార్క్‌ను దాటి, ఈ ఘనత సాధించిన మూడో వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది. 'పుష్ప 2', 'ధురంధర్ 2' తర్వాత ఈ ఘనత సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలో 'బాహుబలి 2' (10 రోజులు), 'ఆర్ఆర్ఆర్' (16 రోజులు), 'కేజీఎఫ్ 2' (18 రోజులు), 'జవాన్' (18 రోజులు), 'పఠాన్' (27 రోజులు) రికార్డులను అధిగమించింది.

'యానిమల్'ను మించిన రణ్‌బీర్ ర్యాంపేజ్!

రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా 'రామాయణం' నిలుస్తోంది. ఆయన గత చిత్రం 'యానిమల్'తో పోలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 'యానిమల్' పదో రోజు ఇండియాలో రూ.36 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. 'రామాయణం' అదే రోజున రూ.72.90 కోట్లు రాబట్టింది. ఇక పది రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్లలోనూ 'యానిమల్' రూ.717.30 కోట్లతో నిలవగా.. 'రామాయణం' ఏకంగా రూ.1,228 కోట్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆదివారం 11వ రోజు నాటికీ ఈ సినిమా రూ.1260కోట్లకి పైగా సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

IFFIలోనూ అరుదైన గౌరవం!

బాక్సాఫీస్ రికార్డులతో దూసుకెళ్తున్న 'రామాయణం'కు అంతర్జాతీయ చలనచిత్ర వేదికపైనా అరుదైన గుర్తింపు లభించింది. నవంబర్ 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2026లోని BRICS విభాగంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి చిత్రంగా నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో వసూళ్ల వేటతో పాటు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ 'రామాయణం' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

భారీ తారాగణం.. రెండు భాగాలుగా రామాయణం!

భారీ తారాగణంతో రెండు భాగాలుగా తెరకెక్కిన ‘రామాయణం’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. తొలి భాగం నవంబర్ 5న విడుదల కాగా, రెండో భాగం 2028 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదలైన పది రోజుల్లోనే రూ.1,228 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. దేశీయంగా, ఓవర్సీస్‌లోనూ రికార్డుల మోత మోగిస్తోంది. ఫుల్ రన్‌లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!