ఉసిరి నీడన ఆత్మీయ విందు .. భాగ్యనగరంలో కార్తీక వనభోజనాల సందడి

ఉసిరి నీడన ఆత్మీయ విందు .. భాగ్యనగరంలో కార్తీక వనభోజనాల సందడి

ఆలయాల్లో హరహర మహాదేవ నినాదాలు.. ఇంటింటా దీపాల వెలుగులు.. తెల్లవారుజామున పవిత్ర స్నానాలు.. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు.. కార్తీక మాసం వచ్చిందంటే నెలంతా ఆధ్యాత్మిక సందడే. ఉరుకుల పరుగుల సిటీ జీవితానికి కాస్త విరామం ఇస్తూ కుటుంబాలు, బంధుమిత్రులతో కలిసి ప్రకృతి ఒడిలో ఒక రోజు గడిపేందుకు నగరవాసులు వనబాట పడుతున్నారు. అపార్ట్‌‌మెంట్ అసోసియేషన్లు, కాలనీలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, సిటీలో స్థిరపడిన వివిధ గ్రామాల వాసులు ప్రత్యేకంగా వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వనభోజనం అంటే కేవలం భోజనం కాదు, దూరమైన బంధాలను దగ్గర చేసే ఆత్మీయ కలయిక.

అరటి ఆకులో విందు

కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించి పూజిస్తారు. చెట్ల మధ్య దీపారాధన, కార్తీక పురాణ పఠనం చేశాక, పులిహోర, గారెలు, పూర్ణాల వంటి సంప్రదాయ శాకాహార వంటకాలను అరటి ఆకుల్లో వడ్డించి అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. పిల్లలకు ఆటపాటలు, మహిళలకు ముగ్గుల పోటీలు, పెద్దలకు ఆత్మీయ పలకరింపులు, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, తంబోలా వంటి పోటీలతో రోజంతా పండుగ వాతావరణం ఉంటుంది. కొన్నిచోట్ల సంఘాల పెద్దలకు సన్మానాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు కూడా అందిస్తున్నారు. నగరానికి దూరంగా ఫామ్‌‌హౌస్‌‌లు, తోటల్లో ఎడ్లబండ్లు, పల్లె ఆటలతో ఊరి వాతావరణాన్ని గుర్తుచేస్తున్నారు.

ఊరి జ్ఞాపకాల కలయిక

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చి సిటీలో స్థిరపడినవాళ్లు తమ స్వగ్రామాల వారీగా సంఘాలుగా ఏర్పడి ‘ఆత్మీయ కలయిక’ పేరుతో వనభోజనాలు జరుపుకుంటున్నారు. చిన్ననాటి స్నేహితులు, బంధువులు ఒకేచోట కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు అత్తోట మురళీ ముకుంద్ శంకర్‌‌పల్లి శివార్లలోని తన ఫామ్‌‌హౌస్‌‌లో ఏటా తమ ఊరివాళ్లతో వనభోజనాలు, సామూహిక వ్రతాలు ఏర్పాటుచేస్తున్నారు. కార్తీక వనభోజనాలు తన చిన్ననాటి స్నేహితులను, ఊరివాళ్లను కలుపుతున్నాయని, మర్చిపోలేని అనుభూతులు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. పలు కుల సంఘాలు కూడా సిటీలోని వివిధ ప్రాంతాల్లో కార్తీక ఆదివారాల్లో వనభోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఏటా నిర్వహించే వనభోజనాలు తమ ఇంటిల్లిపాదికీ స్ఫూర్తినిస్తాయని రెడ్డి సంఘం నాయకుడు శ్యాంసుందర్ రెడ్డి, వివిధ శాఖల బ్రాహ్మణ సంఘాలు గార్డెన్లు, ఆలయ ప్రాంగణాల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయని బ్రాహ్మణ సంఘం నాయకుడు మరుమాముల వెంకటరమణ శర్మ చెప్పారు.

వనభోజనాలకు నెలవు ఇక్కడే

  •     దూలపల్లి కార్తీక వనం: ఫారెస్ట్ అకాడమీ పక్కన దట్టమైన చెట్ల మధ్య ప్రశాంత వాతావరణం
  •     కండ్లకోయ ఆక్సిజన్ పార్క్: కుటుంబాలతో వెళ్లేందుకు మొదటి ఎంపిక
  •     మాదాపూర్, ఉప్పల్ శిల్పారామం: సాంస్కృతిక వాతావరణం, పిల్లలకు ఆటలు
  •     చిలుకూరు మృగవని నేషనల్ పార్క్,   వనస్థలిపురం హరిణ వనస్థలి: జింకల నడుమ వనభోజనాలు
  •     కీసరగుట్ట, చిలుకూరు పరిసరాలు: ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు వనభోజనాలు
  •     అనంతగిరి హిల్స్: అనంత పద్మనాభస్వామి దర్శనం, ట్రెక్కింగ్, వనభోజనం