భారత్ సమిట్ తో రాష్ట్రం అపవిత్రం : కేంద్ర మంత్రి బండి సంజయ్

భారత్ సమిట్ తో రాష్ట్రం అపవిత్రం : కేంద్ర మంత్రి బండి సంజయ్
  •     దేశ వ్యతిరేక శక్తులతో కలిసి నిర్వహించారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శ
  •     విదేశీయుల ముందు దేశాన్ని కించపర్చడం దేశద్రోహమేనని ఫైర్

హైదరాబాద్, వెలుగు: భారత్ సమిట్ నిర్వహణతో రాష్ట్రం అపవిత్రం అయిందని కేంద్రమంత్రి బండి సంజయ్  కుమార్ విమర్శించారు. దేశభక్తులకు, పోరాట యోధులకు నిలయమైన తెలంగాణలో భారత్ వ్యతిరేక శక్తులతో కలిసి ‘భారత్ సమిట్’ నిర్వహించారని తెలిపారు. దేశ ప్రజలే కాదు.. విదేశాలు సైతం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోవడం లేదని అన్నారు. సమిట్ ముగిసిన అనంతరం బండి సంజయ్ మీడియాకు వీడియో విడుదల చేశారు. ప్రధాని మోదీ ప్రపంచం ముందు భారత్ గల్లా ఎగరేసేలా అభివృద్ధి చేస్తుంటే, రాహుల్ మాత్రం దేశ సమస్యలను అంతర్గతంగా చర్చించకుండా విదేశీయుల ముందు దేశ పరువును బజారున పడేస్తున్నారని, ఇది దేశద్రోహమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశాన్ని తప్పుదోవ పట్టించడం దుర్మార్గం

ప్రజాస్వామ్యమంటే ఒకే కుటుంబం దశాబ్దాల పాటు దేశాన్ని పాలించడం, పార్టీని చెప్పుచేతల్లో పెట్టుకోవడమా అని రాహుల్ గాంధీని బండి సంజయ్ నిలదీశారు. ముందు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యాన్ని బతికించి, ఆ తర్వాత దేశ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలని సూచించారు.14 కోట్ల ఓట్లను తొలగిస్తున్నారంటూ దేశాన్ని తప్పుదోవ పట్టించడం దుర్మార్గమని, చనిపోయిన వారివి, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారితో పాటు విదేశాల నుంచి అక్రమంగా వచ్చి ఓట్లు పొందిన 4 కోట్ల ఓట్లను తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలు, బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటుగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ వందల కోట్లు ఖర్చు చేసిందని బట్టకాల్చి మీద వేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టి ఈసీకి ఇచ్చి కోర్టులో పోరాడాలని సవాల్ విసిరారు. భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల స్టాల్ ఏర్పాటు చేయడం పెద్ద జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. మూడేండ్లుగా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను, ఇస్తానన్న రైతు భరోసాను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.