సంస్కృతి అంటే జీవన విధానం..అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందినప్పుడే నిజమైన ప్రగతి : జూపల్లి కృష్ణారావు

సంస్కృతి అంటే జీవన విధానం..అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందినప్పుడే నిజమైన ప్రగతి : జూపల్లి కృష్ణారావు
  •     భారత్ సమిట్ రెండో రోజు ప్యానెల్ డిస్కషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు: సంస్కృతి అంటే కేవలం కళలు లేదా నృత్యాలు మాత్రమే కాదని, అది మన జీవన విధానమని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాలక్రమేణా మన సంప్రదాయాలు, జీవన విధానాలు కొంతవరకు దెబ్బతిన్నాయని, వాటిని దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘భారత్ సమిట్’రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం ‘తెలంగాణ రైజింగ్ – కల్చర్ అండ్ సొసైటీ’అంశంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ సీమా చిష్టి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ అజయ్ గూడవర్తి, ప్రొఫెసర్ నితిన్ సిన్హా, నృత్య కళాకారిణి డాక్టర్ అలేఖ్య పుంజాల, సందీప్ దీక్షిత్ పాల్గొన్నారు. 

మానవాళి అంతా ఒక్కటేనని చాటుతూ శాంతి, అహింస, శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. వివాదాలను ఘర్షణల ద్వారా కాకుండా సంభాషణల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ఉద్యమాలకు, సాంస్కృతిక వ్యక్తీకరణలకు విడదీయరాని సంబంధం ఉందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 1920లలో ఆంధ్ర జన సంఘంతో మొదలై, ఆ తర్వాత ఆంధ్ర మహాసభగా ఎదిగిన సంస్థలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని, హక్కులపై అవగాహనను పెంచాయని గుర్తుచేశారు. దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడంలో సాహిత్యం, కళలు కీలక పాత్ర పోషించాయని, ‘ధూమ్ ధామ్’వంటి జానపద కళారూపాలు గ్రామీణ ప్రజలను చైతన్యపరిచి వారి సమస్యలకు గళమిచ్చాయని వివరించారు.