హైదరాబాద్, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా అత్యధిక శాతం బొగ్గును ఉత్పత్తి చేస్తున్న కొత్తగూడెం రీజియన్ లో లక్ష్యానికి తగినట్లుగా ఓవర్ బర్డెన్(మట్టి) తొలగించాలని అధికారులను సంస్థ సీఎండీ బుద్ధా ప్రకాష్ జ్యోతి ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఏజెన్సీలు తగిన సంఖ్యలో యంత్రాలను, మానవ వనరులను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు.
శనివారం (2026 నవంబర్ 14) ఆయన హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో కొత్తగూడెం రీజియన్ లోని కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఏరియాల ఓపెన్ కాస్ట్ గనుల బొగ్గు ఉత్పత్తి, అందుకు అనుగుణంగా సాగుతున్న ఓవర్ బర్డెన్ తొలగింపు, బొగ్గు రవాణా తదితర అంశాలపై ఏరియాల జీఎంలు, ఓబీ తొలగింపు ఏజెన్సీల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి సంస్థ రోజూ రాష్ట్ర జెన్ కో విద్యుత్ కేంద్రాలకు 75 వేల టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుందని బుద్ధా ప్రకాష్ జ్యోతి తెలిపారు.
అదే టైంలో సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న విద్యుత్ కేంద్రాల అవసరాలకు బొగ్గును రవాణా చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే ఓవర్ బర్డెన్ తొలగింపు నిర్దేశిత లక్ష్యాల మేర జరగాలని స్పష్టం చేశారు. అన్ని ఏరియాలు కలిపి రోజుకు 14.15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ లక్ష్యాలను సాధించాలని, వీటిలో కొత్తగూడెం రీజియన్ కు సంబంధించిన నాలుగు ఏరియాలు రోజుకు 5.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను రోజు తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమీక్షలో సంస్థ డైరెక్టర్లు ఎల్.వి సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
